చీతా మరణం.. కారణం ఆసక్తికరం

ఈనెల 11వ తేదీన తేజస్‌ అనే మగ చీతా గాయాల కారణంగా మరణించింది. తాజాగా ఇప్పుడు సూరజ్ ప్రాణాలు కోల్పోయింది. మొత్తం 8 చీతాలు మృతి చెందడం సంచలనంగా మారింది.

Advertisement
Update:2023-07-15 10:45 IST

మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో మరో చీతా మృతి చెందింది. మగచీతా సూరజ్ తీవ్ర గాయాలతో చనిపోయినట్టు గుర్తించారు అధికారులు. అయితే ఈ చీతా మృతికి వారు ఆసక్తికర సమాధానం చెప్పారు. చీతా మెడపై గాయాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు గాయాలకు కారణాలు విశ్లేషించారు. చీతా మెడపై తడి ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఈగలు చేరడం, అక్కడే గుడ్లు పెట్టి పునరుత్పత్తి చేయడం, ఈగ లార్వా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ తో చీతాకు గాయాలయ్యాయని చెబుతున్నారు. చీతాలు నాలుకతో తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాయి. కానీ వాటి నాలుకకు అందని భాగాల్లో గాయాలు త్వరగా మానవు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈగ లార్వా వల్ల కురుపులు రావడం అవి పెరిగి పెద్దవై చివరకు చీతా మరణానకి కారణం కావడం విశేషం. ఇదే నెలలో చనిపోయిన తేజస్ అనే చీతాకు కూడా మెడపై గాయాలున్నాయి.

వరుస మరణాలు..

చీతాలకు మన దేశంలో నివశించడానికి అనువైన వాతావరణం లేదని, అందులోనూ మధ్యప్రదేశ్ లోని కునో పార్క్ సరైన ఆవాసం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నా కేంద్రం వినలేదు. గతేడాది సెప్టెంబర్ లో ఆఫ్రికాలోని నమీబియా నుంచి 8 చీతాలు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చారు. కునో నేషనల్ పార్క్ లో కొన్ని ఉంచారు. ఇక్కడ ఉంచిన చీతాలు ఒకదాని తర్వాత ఒకటి మృత్యువాత పడుతున్నాయి.

20 చీతాలను భారత్ కి తీసుకురాగా.. ఇప్పటికి 8 మరణించాయి. మార్చి 27వ తేదీన సాషా అనే ఆడ చీతా మూత్రపిండ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నెల తిరగకుండానే ఏప్రిల్ 23న కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్‌ తో ఉదయ్ అనే చీతా మరణించింది. ఆ తర్వాత మే 9న దక్ష అనే ఆడ చీతా మృతి చెందింది. అదే నెలలో మూడు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. ఈనెల 11వ తేదీన తేజస్‌ అనే మగ చీతా గాయాల కారణంగా మరణించింది. తాజాగా ఇప్పుడు సూరజ్ ప్రాణాలు కోల్పోయింది. మొత్తం 8 చీతాలు మృతి చెందడం సంచలనంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News