మాజీ సీఎం భార్య మార్ఫింగ్ వీడియోలు.. అమృత కేసులో మరిన్ని సంచలనాలు
తన తండ్రిని కేసులనుంచి బయటపడేసేందుకు కోటి రూపాయలిస్తానంది. తీరా అమృత పోలీసులకు విషయం చెప్పే సరికి ఫేక్ వీడియోలు పంపి 10కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది.
అమృత ఫడ్నవీస్. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య. గాయకురాలిగా బాగా ఫేమస్. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ తో పెళ్లి తర్వాత రాజకీయ ప్రముఖురాలిగా ఆమె మరింత పాపులర్ అయ్యారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఆమె చీఫ్ గెస్ట్ గా వెళ్తుంటారు. అలాంటి అమృత ఫడ్నవీస్ ని తనదారికి తెచ్చుకుని అక్రమాలకు ఉపయోగించుకోవాలనుకుంది అనిక్ష జై సింఘానీ అనే డిజైనర్. ఇటీవలే అనిక్ష నిజస్వరూపం తెలిసి అమృత, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అనిక్ష కొన్ని మార్ఫింగ్ వీడియోలు పంపించి అమృతను బ్లాక్ మెయిల్ చేయాలని చూసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ఎవరీ అనిక్ష..?
అనిక్ష తండ్రి అనిల్ జై సింఘానీ ప్రముఖ క్రికెట్ బుకీ. అంతర్జాతీయంగా ఆయన క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తూ మాఫియాగా మారాడు. తనకెవరూ అడ్డురాకుండా మేనేజ్ చేయడంలో అతడు దిట్ట. అయితే అతడిపై పోలీస్ కేసులున్నాయి. దాదాపుగా అజ్ఞాతంలోనే ఉంటూ పనులు చక్కబెట్టేవాడు అనిల్. ఆయనపై ఉన్న కేసుల్ని మాఫీ చేసేందుకు కుమార్తె అనిక్ష వేసిన ఎత్తుగడలో అమృత ఫడ్నవీస్ బుక్కయ్యేవారు. చివర్లో ఆమె అలర్ట్ కావడంతో ఆ స్కామ్ లో చిక్కుకోలేదు. అయితే ఆ తర్వాత కూడా అమృతను ఫేక్ వీడియోస్ తో బెదిరించాలని చూసింది అనిక్ష. ఈ విషయం కూడా పోలీసులు పసిగట్టారు.
అమృతా ఫడ్నవీస్ పొలిటికల్ సెలబ్రిటీ. ఆమె అందాన్ని పొగిడి, ఆమె తన డిజైనర్ దుస్తుల్ని ధరిస్తే తనకు పేరొస్తుందని చెప్పి బుట్టలో పడేసింది అనిక్ష. అలా పరిచయం పెంచుకుని, దుస్తులు, ఖరీదైన చెప్పులు ఇస్తూ పర్సనల్ విషయాలు చెప్పుకునేది. తన తండ్రిని కేసులనుంచి బయటపడేసేందుకు కోటి రూపాయలిస్తానంది. తీరా అమృత పోలీసులకు విషయం చెప్పే సరికి ఫేక్ వీడియోలు పంపి 10కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. మహారాష్ట్ర పోలీసులు అనిక్షను అరెస్ట్ చేశారు, రిమాండ్ కి తరలించారు. ఈ కేసునుంచి బయటపడిన అమృత మరోసారి టాక్ ఆఫ్ ది ముంబైగా మారారు.