బీజేపీని గెలిపిస్తే అయోధ్యలో శ్రీ‌రామ‌ దర్శనం ఉచితం.. మధ్యప్రదేశ్ వాసులకు అమిత్ షా ఆఫర్

అయోధ్య రాముడి దర్శనం కోసం మధ్యప్రదేశ్ వాసులు కూడా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుందా? అని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రశ్నించారు.

Advertisement
Update:2023-11-13 18:50 IST

ఎన్నికలు వస్తే చాలు రాజకీయ నాయకులు ఓటర్లకు శతకోటి హామీలు గుప్పిస్తుంటారు. ఆ హామీలను నెరవేర్చగలమా..? లేదా..? అన్నది తర్వాత సంగతి. అప్పటికప్పుడు ఓటర్లను ఆకట్టుకుంటే చాలు అనే విధంగా హామీలు ఇస్తుంటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ వాసులకు బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఓ ఆఫర్ ఇచ్చారు. 'మా పార్టీని గెలిపిస్తే మధ్యప్రదేశ్ వాసులకు అయోధ్యలో ఉచితంగా శ్రీ‌రాముడి దర్శనం కల్పిస్తాం` అని హమీ ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశలోని సిరోంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే అడిగేవారని చెప్పారు. ఆయన అప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నానని.. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని తెలిపారు.

అమిత్ షా ప్రసంగిస్తుండగా.. 'అయోధ్య రాముడి దర్శనం కోసం మధ్యప్రదేశ్ వాసులు కూడా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుందా?' అని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రశ్నించారు. దీనికి అమిత్ షా సమాధానం ఇస్తూ.. మధ్యప్రదేశ్ లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ హామీని ప్రకటించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మధ్యప్రదేశ్ ప్రజలను దశలవారీగా అయోధ్యకు తరలించి శ్రీరాముడి దర్శనం కల్పిస్తామని అమిత్ షా వెల్లడించారు.

వాళ్ల‌ రాజకీయాలన్నీ కొడుకులు, కుమార్తెల కోసమే

సిరోంజ్ సభలో అమిత్ షా కాంగ్రెస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకులు కేవలం వారసుల కోసమే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 'మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ వచ్చే ఎన్నికల్లో తమ కుమారులను ముఖ్యమంత్రులను చేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. తమ కొడుకులు, కుమార్తెల కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఎలా సేవ చేస్తారు?' అని అమిత్ షా ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News