నిఠారీ వరుస హత్యల కేసు.. నిందితులకు మరణశిక్ష రద్దు.. నిర్దోషులుగా తేల్చిన కోర్టు..
మోనిందర్ చిన్నారులపై అత్యాచారం చేసి, హత్య చేసి పడేసినట్టు పోలీసులు గుర్తించారు. మోనిందర్ ఇంట్లో పనిచేసే కోలీ.. నిఠారీ గ్రామం నుంచి బాల, బాలికలను ఏదో ఒక ఆశ చూపి తన యజమాని ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
2006లో సంచలనం సృష్టించిన చిన్నారుల సీరియల్ హత్యల కేసులో నిందితులుగా ఉన్న సురీందర్ కోలి, మోనిందర్ సింగ్ పంథేర్‌ను నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. 12 కేసుల్లో ప్రధాన నిందితుడు సురేందర్ కోలీని నిర్దోషిగా తేల్చింది. గతంలో ప్రధాన నిందితుడు కోలీపై 16 కేసులు నమోదు కాగా 12 కేసుల్లో మరణశిక్ష ఎదుర్కొన్నాడు. మరో నిందితుడు మోనిందర్ సింగ్ పంథేర్‌పై మొత్తం 6 కేసులు నమోదు కాగా, ఇంతకుముందే నాలుగు కేసుల్లో విముక్తి లభించింది. రెండు కేసుల్లో మోనిందర్ సింగ్‌కు ఉరిశిక్ష పడగా, అతడు హైకోర్టులో సవాలు చేశాడు. ఇప్పుడు కోర్ట్ తీర్పుతో వీరిద్దరిపై గతంలో విధించిన మరణశిక్షలు రద్దయ్యాయి. సురీందర్ కోలిపై అన్ని కేసుల్లోనూ అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
అసలేంటీ ఈ నిఠారీ హత్యల కేసు..?
2006లో నోయిడాలో నిఠారీ గ్రామంలో ఓ ఇంటి సమీపంలోని డ్రైనేజీలో 19 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంథేర్ ఇంటి దగ్గరలో కొంతమంది వ్యక్తుల శరీర భాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా ఈ వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. హత్యాలన్నీ 2005 నుంచి 2006 మధ్య చోటుచేసుకున్నాయి.
మోనిందర్ చిన్నారులపై అత్యాచారం చేసి, హత్య చేసి పడేసినట్టు పోలీసులు గుర్తించారు. మోనిందర్ ఇంట్లో పనిచేసే కోలీ.. నిఠారీ గ్రామం నుంచి బాల, బాలికలను ఏదో ఒక ఆశ చూపి తన యజమాని ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మృతులలో 9 మంది బాలికలు, ఇద్దరు బాలురు, 5గురు యువతులు ఉన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడటం సహా శరీర భాగాలను తిన్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. మొత్తానికి 2006 డిసెంబర్ 29న వీరిద్దరు అరెస్ట్ అయ్యారు.
అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే రేపింది. దీంతో.. పంథేర్, సురేందర్ కోలీపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా వీటిలో మూడింటిని కొట్టేశారు. ఇక ఇప్పుడు మిగిలిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. ఈ 14 కేసుల్లో వీరిద్దరికీ వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్షులు, సరైన ఆధారాలు లేని కారణంగా వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. మరి ఇంతకీ నాడు అదృశ్యమైన, అస్థిపంజరాలుగా తేలిన చిన్నారుల మరణం వెనుక అసలు ఎవరు ఉన్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.