విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. ఫ్లైట్‌ని వెనక్కి మళ్లించిన పైలెట్

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 225 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో గొడవపెట్టుకున్నాడు. సహనం కోల్పోయి వారిపై దాడి చేశాడు.

Advertisement
Update:2023-04-10 15:52 IST

ఇటీవల విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాగి అభ్యంతరకరంగా ప్రవర్తించడం, సీటు కోసం కొట్లాడుకోవడం వంటి సంఘటనలు జరగడం నిత్య కృత్యమైంది. ముఖ్యంగా ఇటువంటి ఘటనలు ఎయిర్ ఇండియా విమానాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఎయిర్ ఇండియా విమానంలో అటువంటి సంఘటనే జరిగింది. ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిపై దాడికి పాల్ప‌డ‌టంతో పైలెట్ ఏకంగా విమానాన్ని వెనక్కి మళ్లించాడు.

సోమవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 225 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో గొడవపెట్టుకున్నాడు. సహనం కోల్పోయి వారిపై దాడి చేశాడు. ఎంత సర్ది చెప్పినా అతడు వినకపోవడంతో పైలెట్ ఏకంగా విమానాన్ని వెనక్కి మళ్ళించాడు. తిరిగి ఢిల్లీలోని విమానాశ్రయంలో ఫ్లైట్‌ని ల్యాండ్ చేశాడు. సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని భద్రత సిబ్బందికి అప్పగించారు. ఈ సంఘటన వల్ల కొన్ని గంటల ఆలస్యంగా విమానం తిరిగి లండన్‌కు బయలుదేరింది.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ప్రయాణికుడి అభ్యంతరకర ప్రవర్తన కారణంగానే పైలెట్ విమానాన్ని తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. ప్రయాణికుడి దాడిలో ఇద్దరు క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఒక ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల మిగిలిన ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని, దీనికి చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. కాగా, కొద్దిరోజుల కిందట ఎయిర్ ఇండియా విమానంలో తప్ప తాగిన ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై మూత విసర్జన చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పట్నుంచి ఎయిర్ ఇండియా ప్రయాణికుల భద్రత దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News