రాజస్థాన్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. కాంగ్రెస్‌ ఓట్ బ్యాంకుకు నష్టమేనా?

ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఎంఐఎం.. బీహార్ ఎన్నికల్లో సత్తా చాటింది.

Advertisement
Update:2023-03-26 08:40 IST

తెలంగాణ అసెంబ్లీతో పాటు ఈ ఏడాది చివరల్లో రాజస్థాన్‌లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఆవిర్భవించి.. పలు రాష్ట్రాలకు విస్తరించిన ఏఐఎంఐఎం పార్టీ ఈ సారి రాజస్థాన్ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నది. ఆ రాష్ట్రంలో ముస్లిం, దళిత ఓటర్లు ఎక్కువగా ఉండే 40 సీట్లలో పోటీ చేస్తామని పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అవసరం అయితే భావసారూప్యత కలిగి.. ముస్లింలు, దళితుల పక్షపాత పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని అన్నారు.

200 సీట్లు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగున్నాయి. ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ఎంఐఎం.. బీహార్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు గెలిచారు. కానీ ఆ తర్వాత వాళ్లు ఆర్జేడీలోకి జంప్ అయ్యారు. ఇక యూపీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది. ఆనాడు మొత్తం 0.43 శాతం ఓట్లు తెచ్చుకున్నది. అయితే, ఎంఐఎం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా నష్టం కలుగుతున్నదని.. అది అంతిమంగా బీజేపీకి లబ్ది చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూపీలోని పలు నియోజకవర్గాల్లో ఎంఐఎం చీల్చిన ఓట్ల కారణంగా కాంగ్రెస్, ఎస్పీ వంటి పార్టీలు ఓడిపోవల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్‌లో పోటీ చేస్తే.. అది బీజేపీకే లాభం చూకూరుస్తుందని అంటున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ముస్లిం, దళిత ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలే కారణం. ఇలాంటివి దాదాపు 40 వరకు రాజస్థాన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే ఆల్వార్, భరత్‌పూర్, సవాయ్, మధుపూర్, టోంక్, బార్మర్, మేవట్ వంటి ప్రాంతాల్లో బీజేపీ బలహీనంగా ఉన్నది.

గత ఎన్నికల్లో ఈ 40 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ పార్టీ 29 సీట్లు గెలిచింది. అక్కడ బీజేపీ 7 సీట్లకు పరిమితం కాగా.. బీఎస్పీ మూడు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు ఇక్కడ ఏఐఎంఐఎం పోటీ చేసి ముస్లిం ఓట్లను చీలిస్తే అది కాంగ్రెస్ పార్టీకే నష్టమని అంచనా వేస్తున్నారు. హిందువుల ఓట్లు పోలరైజ్ కావడానికి కూడా ఎంఐఎం సహకరిస్తుందని అంటున్నారు.

కాగా, ఈ విషయంపై అసదుద్దీన్ స్పందించారు. తాము ఏ పార్టీకీ లబ్ది చేకూర్చడానికి ఎన్నికల బరిలోకి దిగడం లేదని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎంఐఎం తరపున బహిరంగ సభలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర అధ్యక్షుడు జమీల్ ఖాన్ అన్నారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఈ సభల్లో పాల్గొంటారని చెప్పారు. రాజస్థాన్‌లో పార్టీ తప్పకుండా బోణీ కొడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News