మహిళ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిన అగ్నివీర్ నిబంధనలు

అవివాహిత మహిళలకు మాత్రమే అగ్నివీర్ పథకం ద్వారా సైన్యంలో చేరే అవకాశం ఉంటుందని జైపూర్‌లోని అగ్నివీర్ జోనల్ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Advertisement
Update:2023-04-03 10:24 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైన్యంలో ఉద్యోగాల భర్తీ కోసం 'అగ్నివీర్' అనే పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సైన్యంలో చేరాలని భావించిన ఎంతో మంది ఆశావహులు రైళ్లను తగుల బెట్టి తమ ఆగ్రహాన్ని వెల్లడించారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. సరే కనీసం ఐదేళ్లైనా సైన్యంలో పని చేసే అవకాశం ఉంటుంది కదా.. అనే ఉద్దేశంతో ఆ పథకం కింద చాలా మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అగ్నివీర్‌లోని నిబంధన మహిళలకు ఇబ్బందికరంగా మారింది. పురుషులకు లేని నిబంధన మహిళలకు విధించడంపై ఆగ్రహంగా ఉన్నారు.

అవివాహిత మహిళలకు మాత్రమే అగ్నివీర్ పథకం ద్వారా సైన్యంలో చేరే అవకాశం ఉంటుందని జైపూర్‌లోని అగ్నివీర్ జోనల్ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అగ్నివీర్ కోసం కేవలం అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా.. శిక్షణ తర్వాత సైన్యంలో పని చేసే మిగిలిన నాలుగేళ్లు కూడా వివాహం చేసుకోబోమని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని నిబంధన పెట్టారు. విడో, డైవోర్సీ మహిళలకు అవకాశం ఉంటుంది. అయితే, వారికి పిల్లలకు ఉండకూడదనే మరో నిబంధన కూడా ఉన్నది. అగ్నివీర్ పథకం ద్వారా జాయిన్ అయ్యాక గర్భం దాల్చమని కూడా హామీ పత్రం రాసి ఇవ్వాలి.

కాగా, ఈ నిబంధనలు లింగ వివక్షతో సమానమని మహిళ అభ్యర్థులు అంటున్నారు. సైన్యంలో చేరేందుకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతే ముందుకు వస్తుంటారు. అక్కడ, 18 ఏళ్లు నిండగానే యువతులకు పెళ్లి చేస్తుంటారు. పాతికేళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉంటే బంధువులు, చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలు ఎక్కువగా ఉంటాయి. ఇక విడాకులు తీసుకున్న, భర్తను కోల్పోయిన మహిళలకు పిల్లలు ఉంటే అనర్హులు అని పేర్కొనడం కూడా మరో వివక్ష అని అంటున్నారు. మగవారిని లేని ఇలాంటి నిబంధనలు మహిళలకు మాత్రం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు కూడా మండి పడుతున్నాయి. వెంటనే నిబంధన ఉపసంహరించుకోక పోతే పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News