'ఆఫ్తాబ్' ఇప్పుడు బీజేపీకి ఎన్నికల అస్త్రం

ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య అంశాన్ని గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ప్రచారాస్త్రంగా ఎక్కుపెట్టారు. మోడీ లేకపోతే ప్ర‌తినగరంలో అఫ్తాబ్ లు పుడతారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
Update:2022-11-20 16:49 IST

ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానికిమతం రంగు పూసి, దాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటుగా మారింది. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ పార్టీ ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ హత్యను ఎన్నికల నినాదంగా మార్చేసింది. శ్రద్ద ను హత్య చేసిన హాఫ్తాబ్ పూనావాలా ముస్లిం కావడం బీజేపీకి కలిసొచ్చింది.

అత్యంత దుర్మార్గంగా శ్రద్దా వాకర్ ను హత్య చేసి ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా చేసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసిన ఆఫ్తాబ్ పై దేశ‌మంతా ఆగ్రహంతో రగిలిపోతోంది. శ్రద్దకు నివాళులు అర్పిస్తూ ఆఫ్తాబ్ ను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా అనేక చోట్ల పలు మహిళా, హక్కుల సంఘాలు సమావేశాలు కూడా ఏర్పాటు చేశాయి. అయితే ప్రజలందరూ ఓ క్రూరుడైన యువకుడు ఒక యువతిని చేసిన అత్యంత దుర్మార్గమైన హత్యగానే చూస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిని చేసిన హత్యగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని లవ్ జీహాదీగా కూడా ప్రచారానికి దిగితున్నారు.

ఇప్పుడు ఇదే అంశాన్ని గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ప్రచారాస్త్రంగా ఎక్కుపెట్టారు. మోడీ లేకపోతే ప్ర‌తినగరంలో అఫ్తాబ్ లు పుడతారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మోడీ మాత్రమే ఇటువంటి సంఘటనలను ఆపగలడని ఢంకా భజాయించి చెప్తున్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ... ''మోడీ లాంటి బలమైన నాయకుడు లేకుంటే, జాతిని తల్లిగా భావించి గౌరవించే వారు లేకుంటే దేశంలో ప్రతి నగరంలో అఫ్తాబ్ లాంటి హంతకులు పుట్టుకొస్తారు. అప్పుడు సమాజాన్ని మనం రక్షించుకోలేము.కాబట్టి, 2024లో మూడవసారి కూడా నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడం చాలా ముఖ్యం" అని అన్నారు.

హిమంత బిస్వా శర్మ ఒక్కరే కాదు గుజరాత్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులంతా గుజరాత్ అభివృద్ది, నిరుద్యోగం, ఉపాధి, వ్యవసాయం వంటి అంశాలపై కాకుండా మతాధారిత సమస్య‌లపై దృష్టి కేంద్రీకరించారు.

శ్రద్దా వాకర్ హత్య జరిగింది ఢిల్లీలో , అక్కడ శాంతి భద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అక్కడి పోలీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి చట్ట‌ ప్రకారం ఎలాంటి అజమాతిషీ లేదు. మరి ఈ హత్యకు బాధ్యత వహించాల్సింది మోడీ సర్కారే కదా! మరి మోడీ ఉంటే ఇలాంటి హత్యలు జరగవని ఆయన మళ్ళీ ప్రధానికాక పోతే అంతటా ఆఫ్తాబ్ లు పుట్టుకొస్తారని చెప్పడంలో ఏం లాజిక్ ఉంది ? మోడీ ప్రధానిగా ఉన్నప్పుడే కదా ఈ ఆఫ్తాబ్ పుట్టుకొచ్చింది ! అర్దంలేని వాదనలు, వ్యాఖ్యానాలు చేస్తూ...తాము ఏం మాట్లాడినా సరే అందులో కాస్త మతం అనే మసాలా చ‌ల్లుతే చాలు జనం నమ్మేస్తారని ఈ బీజేపీ నాయకులు భ్రమ పడుతున్నారా ? శవాల మీద ఓట్లేరుకోవడం ఇంకెంత కాలం ?

Tags:    
Advertisement

Similar News