రాహుల్ తో ఆదిత్య ఠాక్రే.. మహారాష్ట్ర కాంగ్రెస్ లో జోష్

హింగోలిలోని కలమ్నూరిలో వీరిద్దరూ కలసి కొంతదూరం పాదయాత్ర చేపట్టారు. మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ బంధం బలంగానే ఉందని చెప్పడానికే యువనేతలిద్దరూ కలసి నడిచారని అంటున్నారు.

Advertisement
Update:2022-11-11 20:55 IST

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. మహారాష్ట్ర యాత్రలో రాహుల్ గాంధీతో కలసి శివసేన యువ నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. హింగోలిలోని కలమ్నూరిలో వీరిద్దరూ కలసి కొంతదూరం పాదయాత్ర చేపట్టారు. మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ బంధం బలంగానే ఉందని చెప్పడానికే యువనేతలిద్దరూ కలసి నడిచారని అంటున్నారు.

వాస్తవానికి శివసేనలో చీలిక తెచ్చి బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే, ఆ తర్వాత మహా వికాస్ అగాఢీలో కూడా చీలిక తేవాలనుకున్నారు. శివసేన ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ వేరుపడితే ప్రతిపక్షం బలహీనపడుతుందని, అదే అదనుగా తాము బలపడాలని భావించారు. కానీ మహారాష్ట్రలో ప్రభుత్వం కూలినా ఎన్సీపీ, కాంగ్రెస్.. ఉద్ధవ్ వర్గాన్ని విడిచిపెట్టలేదు. మహా వికాస్ అగాఢీ కూటమి మరింత బలంగా మారింది. దీనికి తాజా సంకేతమే రాహుల్, ఆదిత్య ఠాక్రే యాత్ర. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా జోడో యాత్రలో పాల్గొంటానని ప్రకటించినా అనారోగ్యం కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆదిత్య ఠాక్రే, రాహుల్ గాంధీతో కలసి నడచి ప్రత్యర్థి వర్గాల్లో గుబులు పుట్టించారు. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగానే పోటీ చేయబోతున్నాయి. ఏక్ నాథ్ షిండే-బీజేపీ కూటమికి షాకివ్వాలని చూస్తున్నాయి.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పూర్తయ్యే సమయానికి మిత్ర పక్షాలన్నీ మరింత దగ్గరయ్యే అవకాశముంది. కొత్తగా కాంగ్రెస్ కూటమిలోకి వచ్చే ఇతర పార్టీల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని అంటున్నారు. రాహుల్ పాదయాత్రకు ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. రాజకీయ యాత్రలాగా కాకుండా, కేవలం రాజకీయ నాయకుల భేటీలతో సరిపెట్టకుండా సమాజంలో అన్ని వర్గాల వారిని కలుస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ తర్వాత ప్రస్తుతం భారత్ జోడో యాత్ర మహారాష్ట్రకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగాల్సి ఉంది. 5 నెలల పాటు జరిగే ఈ యాత్రం కాశ్మీర్ లో ముగుస్తుంది.

Tags:    
Advertisement

Similar News