అదానీ సంగతి తేల్చండి..! ముందు మీరు డెటాల్ తో కడుక్కోండి..!!

గ్రీన్ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ కంపెనీల్లో అదానీ ఇటీవల భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో తాజా బడ్జెట్ లో గ్రీన్ ఎనర్జీ కోసం రూ.35,000 కోట్లు కేటాయించింది కేంద్రం.

Advertisement
Update:2023-02-11 06:27 IST

అదానీ విషయంలో కేంద్రం పూర్తిగా ఇరుకున పడిపోయిందనే విషయం తాజా బడ్జెట్ సమావేశాలతో తేలిపోయింది. కనీసం అదానీ పేరెత్తేందుకు, వివరణ ఇచ్చేందుకు సైతం ప్రధాని మోదీ సాహసం చేయలేకపోయారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఎప్పుడూ లేనంతగా ఆవేశంతో ఊగిపోయారు. అదానీ వ్యవహారంలో కేంద్రానికి సంబంధం ఏమీ లేదని చెప్పే క్రమంలో ఆమె విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలన్నీ ముందు డెటాల్ తో నోరు కడుక్కోవాలని సూచించారామె.

అదానీ కోసమే ఆ కేటాయింపులా..?

గ్రీన్ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ కంపెనీల్లో అదానీ ఇటీవల భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో తాజా బడ్జెట్ లో గ్రీన్ ఎనర్జీ కోసం రూ.35,000 కోట్లు కేటాయించింది కేంద్రం. అదానీ గ్రూపును దృష్టిలో పెట్టుకుని ఈ కేటాయింపులు జరిగాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలని తిప్పికొట్టే క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఎన్నడూ లేనంతగా ఆవేశానికి గురయ్యారు. కాంగ్రెస్ హయాంలో బావలు, మేనల్లుళ్ల కోసం ఫలహారాలు సమర్పించేవారని, కానీ మోదీ సర్కారుకి అలాంటి పక్షపాతం లేదని అన్నారామె. హరిత ఇంధన రంగం కోసం కేటాయించిన నిధులు, దేశం మొత్తాన్ని పరిగణనలో తీసుకుని కేటాయించినవని, కేవలం ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని చేసినవి కావని చెప్పారామె. రుణాల మంజూరు కోసం ఫోన్లలో పైరవీలు చేసిన ఘనత కాంగ్రెస్‌ దేనని అన్నారామె.

తగ్గేదే లేదు..

అటు ప్రతిపక్షాలు కూడా అదానీ విషయంలో తగ్గేదే లేదంటున్నాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరి షేర్ల మార్కెట్‌ విలువ 47శాతం పడిపోయినా కూడా పెట్టుబడిదారుల విశ్వాసం గురించి ఆర్థిక మంత్రి ఎలా సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి. అదానీ విషయాన్ని ఇంటా, బయటా కాంగ్రెస్‌ నిలదీస్తూనే ఉంటుందని అన్నారు మల్లికార్జున్ ఖర్గే.

Tags:    
Advertisement

Similar News