ఇక్కడ పూనమ్ కౌర్, అక్కడ రియాసేన్.. జోడో యాత్రలో హీరోయిన్లు
హీరోయిన్లు పూనమ్ కౌర్, రియా సేన్.. రాహుల్ తో కలసి భారత్ జోడో యాత్రలో పాల్గొనడం విశేషం. కంగనా రనౌత్ లాగా మోదీ భజన చేసి పద్మ అవార్డులు, జాతీయ ఉత్తమ నటి అవార్డులు పొందడం సులభమే అయినా కూడా వీరు పోరాట పంథా ఎంచుకున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సినీతారలు కూడా ఆయనతో కలసి నడవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో నటి పూనమ్ కౌర్ ఆయనతో కలసి నడవగా వారి షేక్ హ్యాండ్ చాన్నాళ్లపాటు వార్తల్లో నిలిచింది. తాజాగా మహారాష్ట్రలో రియా సేన్, రాహుల్ గాంధీతో కలసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పాటూర్ నుంచి యాత్ర మొదలు కాగా రాహుల్ గాంధీతో కలసి రియాసేన్ కొంతదూరం నడిచారు. ఆయనతో మాట్లాడుతూ హుషారుగా ముందుకు కదిలారు.
తెలంగాణలో నటి పూనమ్ కౌర్ రాహుల్ గాంధీతో కలసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేతపై జీఎస్టీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఆమెకు సలహాలు సూచనలు ఇచ్చారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత నేరుగా గుజరాత్ వెళ్లి మరీ ఉద్యమం మొదలు పెట్టారు పూనమ కౌర్. పద్మశాలి సంఘం నేతలతో కలసి సబర్మతి ఆశ్రమంలో నిరసన తెలిపారు. గుజరాత్ లోని పలు ప్రముఖ ప్రాంతాల్లో చేనేత వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. దీంతో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
నటీనటులు ఎక్కువగా అధికారంలో ఉన్నవారితోనే సఖ్యతగా ఉంటారు. అడపాదడపా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు మాత్రం మోదీ వైఫల్యాలను ఎత్తిచూపడానికి వెనకాడరు. అయితే హీరోయిన్లు పూనమ్ కౌర్, రియా సేన్.. రాహుల్ తో కలసి భారత్ జోడో యాత్రలో పాల్గొనడం మాత్రం విశేషం. కంగనా రనౌత్ లాగా మోదీ భజన చేసి పద్మ అవార్డులు, జాతీయ ఉత్తమ నటి అవార్డులు పొందడం సులభమే అయినా కూడా వీరు పోరాట పంథా ఎంచుకున్నారు. కాంగ్రెస్ విధానాలతోనే దేశానికి భవిత అంటున్నారు. అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.