బీజేపీకి గౌతమి గుడ్‌బై
తాను ప్రతి సందర్భంలోనూ పార్టీ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నానని, 25 ఏళ్ల పాటు సేవ చేసినా తనకు మాత్రం మద్దతు కరువైందన్నారు. అందుకే తీవ్ర నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గౌతమి తెలిపారు.
పాతికేళ్లుగా బీజేపీతో ఉన్న అనుబంధానికి ముగింపు పలుకుతున్నట్టు సినీ నటి గౌతమి ప్రకటించారు. ఆ పార్టీకి తాను రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించడం లేదని, పైగా ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన ఓ వ్యక్తికి కొంతమంది సీనియర్ నేతలు అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాళయం నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపించారని గౌతమి వివరించారు. తాను ప్రతి సందర్భంలోనూ పార్టీ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నానని, 25 ఏళ్ల పాటు సేవ చేసినా తనకు మాత్రం మద్దతు కరువైందన్నారు. అందుకే తీవ్ర నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గౌతమి తెలిపారు.
స్థిరాస్తుల విషయంలో అళగప్పన్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ పోలీసులకు గౌతమి గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డబ్బు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంలో మోసం చేసిన సదరు వ్యక్తిపై కేసులు నమోదయ్యాయని, అప్పటి నుంచి 40 రోజులు గడిచినా.. అతడు తప్పించుకు తిరిగేలా పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు అతనికి సాయం చేస్తున్నారని గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన మోసం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పోలీసు, న్యాయవ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చదువుకుంటూ సినిమాల్లో ప్రవేశించిన గౌతమి తన నటనతో సినీ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు పాత్రలతో మరోసారి తన నటనా ప్రతిభను చూపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.