కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. చెల్లాచెదురుగా పడిన బోగీలు
ప్రమాదం జరిగిన ప్రాంతంలో చిమ్మచీకటిగా ఉండటంతో అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 మందికి గాయాలు అయినట్లు రైల్వే వర్గాలు తెలియజేశాయి.
ఒడిషాలో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్.. ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టడంతో 7 బోగీలు పట్టాలు తప్పాయి. బాలాసోర్‌కు 40 కిలోమీటర్ల దూరంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. బోగీలన్నీ చెల్లాచెదురుగా పడటమే కాకుండా.. ప్రయాణికులు కొందరు బయటకు విసిరవేయబడినట్లు పడిపోయారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో చిమ్మచీకటిగా ఉండటంతో అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 175 మందికి గాయాలు అయినట్లు రైల్వే వర్గాలు తెలియజేశాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్, ఇతర సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్సీ) కార్యాలయానికి చెందిన బృందాలు ఘటనా స్థలానికి పంపబడ్డాయి. ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇప్పటికే ఐదు అంబులెన్సులను అక్కడికి పంపించింది. అలాగే అడిషనల్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ 15 అంబులెన్సులను ఘటనా స్థలానికి పంపి.. క్షతగాత్రులను సమీపంలోని సోరో పట్టణంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.
బాలాసోర్ నుంచి డిస్ట్రిక్ మెజిస్ట్రేట్‌ను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఎస్ఆర్సీకి ఎప్పటికప్పుడు నివేదిక పంపాలని కోరింది. రెండు రైళ్లు ఒకే లైన్ లోకి రావడం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఘటనపై పూర్తి విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది.
ప్రస్తుతం 175 మంది వరకు గాయపడగా.. ఎంత మంది చనిపోయారనే విషయంపై స్పష్టత లేదు. చాలా మంది రైలు బోగీల్లో ఇరుక్కొని పోయారు. వారిని బయటకు తీస్తున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ 06782-262286 హెల్ప్, ఎమర్జెన్సీ లైన్‌ను ప్రారంభించింది.