గుజరాత్‌లో ఆప్ సీఎం అభ్యర్థి వెనుకంజ.. - బీజేపీ అభ్యర్థి క్రికెటర్ జడేజా భార్యదీ అదే బాట
ప్రధానంగా ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాఢ్వీ వెనుకంజలో ఉండటం గమనార్హం. అలాగే బీజేపీ తరఫున బరిలోకి దిగి.. దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివావా జామ్‌నగర్ నార్త్‌లో వెనుకంజలో ఉంది.
గుజరాత్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చడం ద్వారా అక్కడ బీజేపీ విజయాన్ని సుగమం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 52 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, మ్యాజిక్ ఫిగర్‌కు మరో 40 స్థానాల దూరంలో ఉంది. మొదటి రౌండ్ వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం వల్ల అక్కడ బీజేపీకి విజయం నల్లేరుపై నడకలా మారిందని అర్థమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలకు మొదటి రౌండ్‌లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.
ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. బీజేపీ అత్యధికంగా 42.2 ఓటింగ్ శాతంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ 34 శాతం ఓట్లతో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయంగా ఓట్లు సాధిస్తూ.. 19.3 ఓటింగ్ శాతం సాధించడం విశేషం. సీట్ల విషయంలో బాగా వెనుకబడి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం ఆప్ గణనీయంగా సాధించినట్టు అర్థమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆప్ చీల్చకపోతే.. అవి కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లుగా భావించవచ్చు. అలా చూస్తే.. బీజేపీకి ఇది ఇబ్బందికర పరిణామమే. కానీ, ఆప్ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ గెలుపును సుగమం చేసినట్టయింది.
మరోపక్క ఈ ఎన్నికల సందర్భంగా వార్తల్లో నిలిచి పాపులారీటీ సంపాదించుకున్న పలువురు అభ్యర్థులు ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్నారు. ప్రధానంగా ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాఢ్వీ వెనుకంజలో ఉండటం గమనార్హం. అలాగే బీజేపీ తరఫున బరిలోకి దిగి.. దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివావా జామ్‌నగర్ నార్త్‌లో వెనుకంజలో ఉంది. గతంలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన పటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. ఈసారి మాత్రం బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. హార్దిక్ పటేల్ తొలుత వెనుకంజలో ఉన్నా.. ఆ తర్వాత స్వల్ప ఆధిక్యంలోకి వచ్చినట్టు సమాచారం.