ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆప్‌..కొత్త మేయర్‌గా మహేశ్‌ ఖించి

దేశ రాజధాని నగరం దిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ మహేశ్‌ కుమార్‌ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు.

Advertisement
Update:2024-11-14 20:15 IST

ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఉత్కంఠ పోరులో ఆప్ అభ్యర్థి మహేశ్ ఖించి బీజేపీ అభ్యర్థి కిషన్‌‌లాల్‌ను ఓడించి ఢిల్లీ కి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్‌ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్‌ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప మెజార్టీతో ఆప్‌ అభ్యర్థి నెగ్గారు. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి మూడో మేయర్‌గా మహేశ్‌ ఖించి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో ఆప్‌ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, ఎన్‌డీ గుప్తా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సబిలా బేగమ్‌ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆప్‌, బీజేపీ మధ్య పోరుతో వాయిదా పడుతూ వచ్చాయి. నూతన మేయర్‌ ఐదు నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బీజేపీకి మొత్తం 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. అయితే, ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News