ఈనెల 22న పంజాబ్ అసెంబ్లీ విశ్వాస పరీక్ష..
ఢిల్లీలో బేరసారాలకు అవకాశం ఉందన్న అనుమానం రాగానే, విశ్వాస పరీక్ష ద్వారా బలనిరూపణ చేపట్టి బీజేపీకి షాకిచ్చారు కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ లో కూడా బలపరీక్షకు సీఎం భగవంత్ మాన్ ని సిద్ధం చేశారు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విశ్వాస పరీక్షలు నిత్యకృత్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ఎమ్మెల్యే చేజారిపోతారోననే భయం ఆయా పార్టీల్లో నెలకొని ఉంది. ఇటీవల ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు విశ్వాస పరీక్షలలో నెగ్గగా.. ఇప్పుడు పంజాబ్ కూడా అదే బాట పట్టింది. ఈనెల 22న పంజాబ్ అసెంబ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నట్టు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రపంచంలోని ఏ కరెన్సీ కూడా ప్రజల విశ్వాసానికి విలువ కట్టలేదని అన్నారాయన. సెప్టెంబర్-22న పంజాబ్ విధానసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామన్నారు. విప్లవం చిరకాలం జీవించు అంటూ.. ఆయన పంజాబ్ లో ట్వీట్ చేశారు.
పంజాబ్ లో తమ ఎమ్మెల్యేలకు బీజేపీ 25కోట్లు ఆఫర్ చేసిందంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసింది. తమ పార్టీ నేతలతో జరిగిన బేరసారాలకు ఆధారాలు కూడా ఉన్నాయంది. రాష్ట్ర స్పీకర్ కు, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏంటంటే.. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉండగానే, అటు గోవాలో 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ హోల్ సేల్ గా కొనేసింది. పంజాబ్ లో మాత్రం కొనుగోలు వ్యవహారం కుదరలేదు. అయితే ముందు జాగ్రత్తగా ఇక్కడ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు సీఎం భగవంత్ మాన్. సెప్టెంబర్ 22న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను విడదీయడానికి బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్.. విఫలమైందని చెప్పడానికి, తమ ప్రభుత్వం బలంగా ఉందని చట్టపరంగా నిరూపించడానికే ఈ సమావేశం అని చెబుతున్నారాయన.
285మంది ఎమ్మెల్యేల కొనుగోలు..
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 285 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసి కొనుగోలు చేసిందని ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఢిల్లీలో బేరసారాలకు అవకాశం ఉందన్న అనుమానం రాగానే, విశ్వాస పరీక్ష ద్వారా బలనిరూపణ చేపట్టి బీజేపీకి షాకిచ్చారు. ఇప్పుడు పంజాబ్ లో కూడా బలపరీక్షకు సీఎం భగవంత్ మాన్ ని సిద్ధం చేశారు.