ఆమ్ ఆద్మీ అభ్యర్థి కిడ్నాప్.. బీజేపీ పనేనా..?

ఓటమి భయంతో బీజేపీ తమ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు ఆమ్ ఆద్మీ నేతలు. అభ్యర్థిని అపహరించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేనన్నారు.

Advertisement
Update: 2022-11-16 08:35 GMT

ఎన్నికలప్పుడు స్వతంత్ర అభ్యర్థుల అజ్ఞాతవాసం, కిడ్నాప్ లాంటి వ్యవహారాలు సాధారణంగా జరుగుతుంటాయి. కానీ ప్రధాన పార్టీ అభ్యర్థి కిడ్నాప్ కావడం గుజరాత్ ఎన్నికల్లో సంచలనంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా సూరత్ ఈస్ట్ నియోజకవర్గంలో నామినేషన్ వేసిన రోజు నుంచి కనబ‌డ‌టం లేదు. బీజేపీ నేతలే ఓటమి భయంతో తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.

సూరత్ తూర్పు నియోజకవర్గంలో గత మూడు దఫాలుగా బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈసారి అక్కడ గట్టిపోటీ నెలకొని ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వగా.. ఆమ్ ఆద్మీతోపాటు, కాంగ్రెస్ కూడా అక్కడ గట్టి పోటీ ఇస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 13 వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఈసారి త్రిముఖ పోరులో బీజేపీకి విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అక్కడ ఎలాగైనా ఆధిపత్యం నిరూపించుకోడానికి సిద్ధమైంది కమలదళం. అందులో భాగంగా కిడ్నాప్ ప్లాన్ వేశారని అంటున్నారు ఆప్ నేతలు.

మంగళవారం కంచన్ జరివాలా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వెనక్కి తీసుకోవాలని ఆయనపై ఒత్తిడి చేసినా కుదర్లేదు. నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా బీజేపీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన నామినేషన్‌ని అధికారులు అంగీకరించారు. దీంతో చివరి ప్రయత్నంగా అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది. తమ అభ్యర్థి కనిపించకపోవడంతో ఆయన కిడ్నాప్ అయి ఉంటారని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. బీజేపీపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీయే తమ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. అభ్యర్థిని అపహరించడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేనన్నారు ఆప్ నేతలు. అయితే బీజేపీ ఈ విమర్శలను తిప్పికొట్టింది. అభ్యర్థులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు బీజేపీ నేతలు.

Tags:    
Advertisement

Similar News