బీహార్‌లో వింత ఘటన.. చుట్టూ 500 మంది అమ్మాయిలను చూసి స్పృహ కోల్పోయిన యువకుడు
పాఠశాలలోని పెద్ద హాల్లో అతడికి టేబుల్ కేటాయించారు. పరీక్షా కేంద్రంలో, పరీక్ష రాసే గదిలో చుట్టూ ఎక్కడ చూసినా అమ్మాయిలే కనిపించడంతో కంగారులో స్పృహ తప్పి పడిపోయాడు.
బీహార్ రాష్ట్రంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు వెళ్లిన ఒక యువకుడు ఎగ్జామినేషన్ హాల్‌లో 500 మందికి పైగా అమ్మాయిలు ఉండటం చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సుందర్ గడ్ కు చెందిన 17 ఏళ్ల మనీశ్ శంకర్ స్థానిక అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా, ఒక్కో వ్యక్తిలో ఒక్కో ఫోబియా ఉన్నట్లు అమ్మాయిలు అంటే మనీశ్ ఆమడ దూరం ఉంటాడు. అమ్మాయిలతో మాట్లాడేందుకు జంకుతాడు.
ఇదిలా ఉండగా బీహార్‌లో ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మనీశ్ కి బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ ఎగ్జామ్స్ సెంటర్ గా పడింది. బుధవారం షెడ్యూల్ ప్రకారం మ్యాథ్స్ పరీక్ష జరగాల్సి ఉంది. దీంతో మనీశ్ ను ఉదయాన్నే అతడి తండ్రి బ్రిలియంట్ కాన్వెంట్ వద్ద వదలి వెళ్ళాడు. మనీశ్ పరీక్షా కేంద్రంలోకి వెళ్ళగానే లోపల వందల మంది అమ్మాయిలు అతడికి కనిపించారు.
పాఠశాలలోని పెద్ద హాల్లో అతడికి టేబుల్ కేటాయించారు. పరీక్షా కేంద్రంలో, పరీక్ష రాసే గదిలో చుట్టూ ఎక్కడ చూసినా అమ్మాయిలే కనిపించడంతో కంగారులో స్పృహ తప్పి పడిపోయాడు. ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు వెంటనే మనీశ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కాగా, ఈ ఘటనపై మనీశ్ మేనత్త మాట్లాడుతూ 'బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ పరీక్షా కేంద్రంలో సుమారు 500 మందికి పైగా అమ్మాయిలు పరీక్ష రాసేందుకు వచ్చారు. నా మేనల్లుడికి పాఠశాలలోని మెయిన్ హాల్లో సీటు కేటాయించారు. అంతమంది అమ్మాయిలను ఒకేసారి చూడటంతో మనీశ్ కంగారుపడి స్పృహ తప్పిపోయాడు' అని చెప్పింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చుట్టూ అంతమంది అమ్మాయిలు ఉంటే స్పృహ తప్పడం ఏంటి బ్రో.. అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.