షిండేదే అసలైన శివసేన.. ఉద్ధవ్‌కు షాకిచ్చిన స్పీకర్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే సుమారు రెండున్నర సంవత్సరాలు కొనసాగారు. ఆ తర్వాత శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే ఉద్ధవ్ పై తిరుగుబాటు చేశారు.

Advertisement
Update:2024-01-10 19:32 IST

ఉద్ధవ్ ఠాక్రేకు రాజకీయపరంగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ముందుగా ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం, ఆ తర్వాత శివసేన రెండుగా చీలిపోవడం, చీలిపోయిన శివసేనే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం, స్పీకర్ కూడా తేల్చడం ఉద్ధవ్ ఠాక్రేకు శరాఘాతంలా మారింది. షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీనే అసలైన శివసేన పార్టీ అని తాజాగా మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకార్ తేల్చి చెప్పారు.

2019లో శివసేన ఎన్డీఏతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టింది. ఈ మూడు పార్టీలు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే సుమారు రెండున్నర సంవత్సరాలు కొనసాగారు. ఆ తర్వాత శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే ఉద్ధవ్ పై తిరుగుబాటు చేశారు. శివసేనను చీల్చి 40 మందికి పైగా ఎమ్మెల్యేలతో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేశారు. తమదే అసలైన శివసేన అని ప్రకటించుకున్నారు. తన వర్గంతో కలిసి షిండే బీజేపీకి మద్దతు తెలిపారు.

ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా షిండే బాధ్యతలు చేపట్టారు. అనంతరం పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీం ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కే ఉందని తీర్పు ఇచ్చింది.

తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే నేతృత్వంలోని శివసేననే అసలైన శివసేన పార్టీ అని వెల్లడించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకే ఉన్నందున నిజమైన శివసేన ఆయనదే అని చెప్పారు. ఇదివరకే ఎన్నికల సంఘం నిజమైన శివసేన షిండేదే అని ప్రకటించి విల్లు - బాణం గుర్తును కేటాయించింది. ఇప్పుడు స్పీకర్ కూడా షిండే శివసేననే అసలైన శివసేన అని ప్రకటించడంతో ఉద్ధవ్ ఠాక్రేకు పెద్ద దెబ్బ తగిలినట్లుంది.

Tags:    
Advertisement

Similar News