భారత్ నుంచి పాక్.. వరద బాధితుడి విచిత్ర ప్రయాణం
పంజాబ్ లోని కసూర్ జిల్లాకు చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే అతడు ఏకంగా దేశ సరిహద్దులు దాటేశాడు.
ఇటీవల పాకిస్తాన్ నుంచి భారత్ కు, భారత్ నుంచి పాక్ కు ప్రేమపక్షులు ఎగిరిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అక్రమ వలసదారులుగా వారిపై పోలీసులు నిఘా కూడా పెట్టారు. అయితే ఇది కూడా అలాంటి అక్రమ వలసే. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయాణం కాదు. సట్లెజ్ నది వరదల్లో భారత్ నుంచి కొట్టుకుపోయిన వ్యక్తి పాకిస్తాన్ లో తేలిన విచిత్ర ఘటన.
పంజాబ్ లో భారీ వరదల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సట్లెజ్ నది వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. సట్లెజ్ నది భారత్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తుంది. ఈ వరద ప్రవాహంలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. పంజాబ్ లోని కసూర్ జిల్లాకు చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే అతడు ఏకంగా దేశ సరిహద్దులు దాటేశాడు. అలా కొట్టుకుపోయి చివరకు పాకిస్తాన్ లో తేలాడు. వాస్తవానికి ఇది అక్రమ వలస అనుకోవాల్సిందే. భారత పౌరుడు పాకిస్తాన్ లో కనపడటంతో సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణ చేపట్టి, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తేల్చి తిరిగి భారత అధికారులకు అప్పగించారు.
యమున ప్రకోపం..
హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలతో మళ్లీ జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కుండపోత వర్షాలకు పర్వత ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోతున్నాయి. వంతెనల వద్ద ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం ఉంటోంది. ఇటు ఢిల్లీలో యమున మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి 8 గంటల సమయానికి ప్రమాదకర స్థాయి (205.33 మీటర్ల ఎత్తు)లో యమున ప్రవహిస్తోంది. ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ వరదనీరు చేరుతోంది.