కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పెరుగుతున్న పోటీదారుల జాబితా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడేవారి జాబితా పెరుగుతోంది. ఈ పోటీలో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్లతో పాటు కొత్తగా కమల్ నాథ్, మనీష్ తివారీ, పృథ్వీరాజ్ చవాన్, ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు కూడా పోటీలో ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement
Update:2022-09-22 20:54 IST

దాదాపు ఇర‌వై రెండేళ్ళ త‌ర్వాత గాంధీ కుటుంబేత‌ర వ్య‌క్తి కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని పొందేందుకు పార్టీ సిద్ధ‌మ‌వుతోంది.

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ గురువారంనాడు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అధ్య‌క్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన అధినేత్రి సోనియాగాంధీ వారసుడిని ఎన్నుకోవడానికి ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశి థరూర్‌లు ముఖ్య‌మైన పోటీదారులుగా కనిపిస్తున్నారు.

అయితే, గ్రాండ్ ఓల్డ్ పార్టీలో అత్యున్నత పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల జాబితా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వ‌ర‌స‌లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లు వెలువడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చేరినట్లు సమాచారం. క‌మ‌ల్ నాథ్ పార్టీ చీఫ్ పదవికి పోటీ చేయవచ్చు అని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

ఈ రేసులో కేంద్రమాజీ మంత్రులు మనీష్ తివారీ, పృథ్వీరాజ్ చవాన్, ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. అయితే చవాన్, వాస్నిక్ మాత్రం తాము పోటీదారుల‌న్న వార్త‌ల‌ను కొట్టిపారేశారు.

థరూర్‌లాగే, తివారీ కూడా పార్టీలో సంస్కరణలు కోరుతూ సోనియా గాంధీకి లేఖ రాసిన అసమ్మతివాదుల సమూహంలో (జి-23) స‌భ్యుడే. ఇప్ప‌టికే దిగ్విజ‌య్ సింగ్ తాను కూడా పోటీలో ఉంటాన‌న్న సంకేతాలు ఇచ్చారు. నామినేష‌న్ల చివ‌రి రోజున తేలుతుంది పోటీలో ఎవ‌రెవ‌రు ఉంటారోన‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఇవాళ రేప‌ట్లో ఆయ‌న ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని క‌లిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఈ వారం ప్రారంభంలో సోనియా గాంధీతో సమావేశమైన తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు థరూర్ స్పష్టం చేసిన వెంటనే, గెహ్లాట్ పేరు ఆయ‌న పోటీదారుగా ప్రచారంలోకి వచ్చింది. గత నాలుగు దశాబ్దాలుగా నెహ్రూ-గాంధీ కుటుంబ విధేయుడిగా ఉంటూ, ఇప్పటికే మూడోసారి సీఎంగా కొనసాగుతున్నందున, పార్టీ అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం గెహ్లాట్ గాంధీల ఛాయిస్ అని గ‌ట్టిగా విన‌బ‌డుతోంది.

గాంధీ కుటుంబీకులు పోటీకి దూరంగా ఉండేట్ల‌యితే , తాము రిమోట్‌తో నియంత్రించగలిగే వారెవరైనా ప‌గ్గాలు చేపట్టాలని వారు కోరుకుంటార‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గాంధీ విధేయులతో పోలిస్తే, ఎన్నికలలో పోటీ చేస్తున్న జి-23 సభ్యులకు అవ‌కాశాలు తక్కువగానే ఉంటాయ‌ని అంటున్నారు. చాలా మంది అభ్య‌ర్ధులు రంగంలోకి దిగ‌నుండ‌డంతో, పార్టీ అధ్య‌క్ష పదవికి పోటీ తీవ్రంగానే ఉండేట్లు క‌న‌బ‌డుతోంది. పోటీ జ‌రిగితే మాత్రం 22 సంవత్సరాల తర్వాత పార్టీ తొలి గాంధీయేతర చీఫ్‌ను చూడవచ్చు.

రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన 2017, 2019 మధ్య రెండేళ్లు మినహా 1998 నుండి పార్టీ అధ్యక్షురాలిగా ఎక్కువ కాలం పనిచేసిన సోనియా గాంధీ స్థానంలో కొత్త అధ్యక్షుడు రానున్నందున రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా చరిత్రాత్మకమైనవిగానే భావిస్తున్నారు. పార్టీ అత్యున్న‌త ప‌ద‌వికి చివరిసారిగా నవంబర్ 2000లో ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్పుడు సోనియా గాంధీ పై జితేంద్ర ప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు సీతారాం కేస‌రి 1997లో శరద్ పవార్, రాజేష్ పైలట్‌లను ఓడించారు.

Tags:    
Advertisement

Similar News