కేరళ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య రాజుకున్న వివాదం
తొమ్మిది మంది వీసీలు రాజీనామా చేయాలంటూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ హుకుం జారీ చేయడంతో ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య వివాదం భగ్గుమంది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు
కేరళలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య మరోసారి వివాదం నెలకొంది. వైస్ ఛాన్సెలర్ల (వీసీలు) నియామకాల విషయంలో తలెత్తిన ఈ వివాదం రచ్చగా మారుతోంది. తొమ్మిది మంది వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ హుకుం జారీ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. వారిని రాజీనామాలు చేయమనే అధికారం గవర్నర్ కు లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు కేరళ టెక్నలాజికల్ యూనివర్శిటీ కి సంబందించినవి మాత్రమేనని, ఆ వర్శిటీకే ఆ ఉత్తర్వులు పరిమితమని ముఖ్యమంత్రి చెప్పారు.
మరోవైపు గవర్నర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనివర్సిటీల వీసీలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను పరిశీలించేందుకు కేరళ హైకోర్టు సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ పిటిషన్లను జస్టిస్ దేవన్ రామచంద్రన్‌తో కూడిన సింగిల్ బెంచ్ పరిశీలించనుంది.
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విజయన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాలపై గవర్నర్ చర్యలు దురాక్రమణగా ఉన్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు.
రాష్ట్రంలోని తొమ్మిది వర్సిటీల వైస్ ఛాన్సలర్ల రాజీనామాను కోరుతూ ఖాన్ ఆదివారంనాడు రాజకీయ తుఫానును రేపిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారంనాడు ముఖ్యమంత్రి స్పందించారు. గవర్నర్ చర్య అసాధారణమని అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను "నాశనం" చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన "యుద్ధం" చేస్తున్నారని ఆరోపించారు.
ఈ తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించింది గవర్నర్ అని, ఈ నియామకాలు చట్టవిరుద్ధంగా జరిగితే, ప్రాథమిక బాధ్యత గవర్నర్‌దేనని అన్నారు. వారి రాజీనామాలు కోరే అధికారం ఛాన్సలర్‌కు లేదని ముఖ్యమంత్రి అన్నారు.