సుసైడ్ నోట్ లో బీజేపీ ఎమ్మెల్యే పేరు రాసి ఆత్మహత్యచేసుకున్న బిజినెస్ మ్యాన్

ప్రదీప్ అనే వ్యాపార వేత్త జనవరి 1, ఆదివారం నాడు బెంగుళూరు శివార్లలోని నెట్టిగెరె వద్ద ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆర్థిక వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి జోక్యం చేసుకున్నాడని, తనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకు మద్దతుగా నిలిచాడని, తాను డబ్బును తిరిగి పొందడంలో సహాయం చేయడానికి నిరాకరించాడని సూసైడ్ నోట్‌లో ప్రదీప్ ఆరోపించారు.

Advertisement
Update:2023-01-02 14:27 IST

తన ఆత్మహత్యకు బీజేపీ ఎమ్మెల్యే కారణమని లేఖరాసి ఆత్మహత్య చేసుకొని మరణించాడు ఓ వ్యాపారవేత్త. బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.

ప్రదీప్ అనే వ్యాపార వేత్త జనవరి 1, ఆదివారం నాడు బెంగుళూరు శివార్లలోని నెట్టిగెరె వద్ద ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆర్థిక వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి జోక్యం చేసుకున్నాడని, తనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకు మద్దతుగా నిలిచాడని, తాను డబ్బును తిరిగి పొందడంలో సహాయం చేయడానికి నిరాకరించాడని సూసైడ్ నోట్‌లో ప్రదీప్ ఆరోపించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరులోని అంబలిపుర నివాసి అయిన ప్రదీప్ న్యూ ఇయర్ పార్టీ కోసం తన బంధువులతో కలిసి నెట్టిగెరెలోని రిసార్ట్ కు వెళ్ళాడు. ఆదివారం ఉదయం సైరా వెళుతున్నానని చెప్పి రిసార్ట్ నుంచి బయటకు వెళ్లి తిరిగి అంబలిపురలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత తిరిగి రిసార్ట్‌కు వెళ్లి, ఆదివారం సాయంత్రం నగరానికి తిరిగి వస్తుండగా కారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సూసైడ్ నోట్ ప్రకారం, గోపి, సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఒప్పించడంతో ప్రదీప్ 2018లో బెంగళూరులోని ఒక క్లబ్‌లో రూ.1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్లబ్‌లో పనిచేసినందుకు జీతంతో సహా ప్రతి నెలా రూ. 3 లక్షలు తిరిగి చెల్లిస్తామ‌ని ఆ ఇద్దరు వ్యక్తులు వాగ్దానం చేసినట్లు నోట్‌లో పేర్కొన్నాడు ప్రదీప్. ప్రదీప్ నోట్‌లో జి రమేష్ రెడ్డి, జయరామ్ రెడ్డి, రాఘవ భట్ అనే మరో ముగ్గురి పేర్లు కూడా ఉన్నాయి. "నేను మే 2018 నుండి డిసెంబర్ వరకు పెట్టుబడి పెట్టాను, కానీ వారి నుండి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నా ఖర్చులు, రుణాలు తిరిగి చెల్లించడానికి నేను మైసూర్‌లోని నా ఇల్లు, మరో స్థలాన్ని విక్రయించాల్సి వచ్చింది" అని ప్రదీప్ నోట్‌లో రాశాడు.

అదే నోట్‌లో, గోపి, సోమయ్యతో మాట్లాడాలని ఎమ్మెల్యే అరవింద్ లింబావళిని అభ్యర్థించగా ఆయన గోపి, సోమయ్యలకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు.

అయితే ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్, ఈ సంఘటనతో తనకేమాత్రం సంబంధం లేదని చెప్పాడు. "సూసైడ్ నోట్‌లో నా పేరు ఉందని నాకు తెలిసింది. అతను (ప్రదీప్) 2010, 2013 మధ్య నా సోషల్ మీడియాను నిర్వహించేవాడు. అతను తన వ్యాపార వివాదాన్ని నా దృష్టికి తీసుకువచ్చాడు. సమస్యను పరిష్కరించమని అతని భాగస్వాములను సహృదయపూర్వకంగా అడిగాను. అతను ఎంత పెట్టుబడి పెట్టాడు, భాగస్వాములు ఎంత చెల్లించాలి అనే వాటి గురించి కూడా నేను అడగలేదు. తరువాత, అతను (ప్రదీప్) వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పాడు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో, నోట్‌లో నా పేరు ఎందుకు రాశాడోరు నాకు తెలియదు. " అని ఓ ప్రముఖ పత్రికతో అన్నాడు.

అయితే వ్యాపార వేత్త ప్రదీప్ ఆత్మహత్య పట్ల బీజేపీ ఎమ్మెల్యే పై విమర్శలు రేగుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తే స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే పేరును తన లేఖ‌లో రాసిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం వేచి చూడాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News