దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం.. 81 కోట్ల మంది ఆధార్ డేటా డార్క్ వెబ్‌లో
ఈ డేటా ఎలా బయటకి వెళ్లిందో తెలుసుకోవడానికి సీబీఐ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ద్వారా ఈ డేటా బయటికి పొక్కినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఆధార్ కార్డు.. ఇది లేనిదే దేశంలో బిడ్డ పుట్టకూడదు.. మనిషి చావకూడదు అన్నట్లు తయారు చేశారు. రేషను కార్డు నుంచి మెడికల్ కాలేజ్ సీటుదాకా అన్నింటికీ ఆధారే ఆధారమన్నట్లు రూల్స్ పెట్టేశారు. అలా అన్నింటికీ ఇష్టారాజ్యంగా ఆధార్ వాడేస్తున్నారు.. కానీ ఆ వివరాలను సురక్షితంగా ఉంచడాన్ని మాత్రం గాలికొదిలేశారు. ఇప్పుడు ఏకంగా 81 కోట్ల మందికి పైగా భారతీయుల ఆధార్ డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉందన్న ప్రకటన ఆందోళన కలిగిస్తోంది.
పేర్లు, ఫోన్ నంబర్లతో సహా డేటా లీక్
అమెరికా సెక్యూరిటీ సంస్థ రీసెక్యూరిటీ నివేదిక ప్రకారం 81.5 కోట్ల మంది భారతీయుల వివరాలు డార్క్‌వెబ్‌లో ఉన్నాయి. పేరు, ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, ఆధార్, పాస్‌పోర్ట్ వివరాలు సహా మొత్తం వివరాలున్నాయని గత నెలలో ఓ వ్యక్తి డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టాడు. 80 వేల డాలర్లు ఇస్తే ఆ వివరాలన్నీ ఇచ్చేస్తానంటున్నాడని రీసెక్యూరిటీ హెచ్చరించింది.
సీబీఐ ఎంక్వయిరీ షురూ!
ఈ డేటా ఎలా బయటకి వెళ్లిందో తెలుసుకోవడానికి సీబీఐ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ద్వారా ఈ డేటా బయటికి పొక్కినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మన వ్యక్తిగత వివరాలు అంటే ఫోన్ నంబర్, ఆధార్, పాస్‌పోర్ట్ లాంటి వివరాలు ఇలా బహిరంగమైపోతే సైబర్ భద్రత అనే మాటకు అర్థమేముంటుంది? ఇది హ్యాకర్లు, ఆన్‌లైన్ మోసగాళ్ల చేతిలో పడితే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయొచ్చు. ఇంకెలాంటి ఆన్‌లైన్ మోసానికయినా పాల్పడొచ్చు కూడా!