8 గంటలు, 4 డ్రస్సులు.... మోడీ ఫ్యాషన్ షో
ప్రధాని మోడీ శుక్రవారంనాడు ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆయన గడిపిన 8 గటల్లో 4 డ్రస్సులు మార్చి 'ఫ్యాషన్ గురు' అనే పేరును సార్థకం చేసుకున్నారు.
భారత్ దేశాన్ని విశ్వగురుగా చేస్తానని ప్రధాని మోడీ చెప్పే మాటలు నిజమవుతాయో లేదో కానీ ఆయన మాత్రం ఫ్యాషన్ గురు మాత్రం అయ్యాడని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సెటైర్ లను ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరేమన్నా సరే తన మానాన తాను గంటకో వేషం వేస్తూనే ఉంటాడు. సందర్భానికి తగ్గట్టు ఆయన ఒక్కో కార్యక్రమానికి ఒక్కో రకమైన దుస్తులు వేసుకోవడం, అలంకరణ చేసుకోవడం చూస్తే గొప్ప గొప్ప ఫ్యాషన్ డిజైనర్లు కూడా విస్తుపోతూ ఉంటారు.
ఆయన దుస్తుల గురించి, అలంకరణ గురించి హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ హరీష్ ఠాకూర్ ఓ సిద్దాంతమే చెప్పారు. ఆయనేమంటారంటే... ''రాజకీయ సమావేశాల్లో స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు ప్రజలకు దగ్గరకావడానికి,వారి భావోద్వేగాలను తట్టి లేపడానికి,స్థానికతను, జాతీయతను ప్రేరేపించడానికి ఎలాంటి దుస్తులు ధరించాలో,ఎలాంటి సాంస్కృతిక చిహ్నాల ప్రతీకలను ప్రదర్శించాలో తెలిసిన ఒకే ఒక రాజకీయ నాయకుడు మోడీ'' అని ఆ ప్రొఫెసర్ వాదన.
ఇక మొన్న శుక్రవారంనాడు మోడీ ఉత్తరాఖండ్ పర్యటించారు. శుక్రవారం ఉదయం డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయంలో ఆయన దిగినప్పుడు, రంగురంగుల, ప్రింటెడ్ స్టోల్‌తో కూడిన సాదా తెల్లని కుర్తాను ధరించి కనిపించాడు.
తరువాత, కేదార్‌నాథ్ మందిరంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, అతను హిమాచల్ ప్రదేశ్‌లోని 'గడ్డి' కమ్యూనిటీకి చెందిన మగవారి సాంప్రదాయ దుస్తులైన 'చోళ డోరా'ను ధరించాడు. పొడవాటి, తెల్లటి కోటు (చోళ), ఉన్ని బెల్ట్ (డోరా), పహారీ టోపీతో ఉన్న మోడీ చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. గత ఎనిమిదేళ్లలో మోడీ కేదార్‌నాథ్‌కు వెళ్లడం ఇది ఆరోసారి.
బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేటప్పుడు అతను పసుపు స్టోల్, నల్లటి పఫర్ జాకెట్ ధరించి కనిపించాడు.
తరువాత, మాన అనే గ్రామంలో బహిరంగ సభ లో బూడిద రంగు బటన్-డౌన్ ఓవర్ కోట్ ధరించాడు, దానిపై అతను బూడిద రంగు స్టోల్ వేసుకున్నారు. చేతులకు ఆ కలర్స్ తగ్గ గ్లవ్స్ వేసుకున్నారు.
అతను శుక్రవారం కేదార్‌నాథ్ లో ధరించిన ఉన్ని కోటు స్వస్తిక్ వంటి చిహ్నాలతో ఎంబ్రాయిడరీ చేయబడింది. కృష్ణుడికి ఇష్టమైన నెమలి ఈక కూడా ఉంది.
హిందువులకు అత్యంత గౌరవప్రద పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను మోడీ దీపావళికి ముందు సందర్శించడం,హిందువులకు ఇష్టమైన దుస్తులను ధరించడం ఆయనేదో మాములుగా చేసిన విషయం కాదు. దాని వెనక ఓట్ల రాజకీయముంది. హిందూ ఓటర్లకు, ముఖ్యంగా హిమాచల్, గుజరాత్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించిన సందేశం ఉంది.
నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ , ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్ సంప్రదాయాలు, సంస్కృతి పట్ల తనకు చాలా గౌరవముందని తెలియజేయడానికే ప్రధాని ఈ దుస్తులను ఎంపిక చేసుకున్నట్టుగా ఉందని విమర్శకుల వాదన.
ప్రధానిమోడీ గంటకో డ్రస్సు మార్చడం, కొత్త కొత్త అలంకరణలతో కనిపించడం కొత్తకాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడి పరిస్థితులు, సంస్కృతి, అందుకు తగ్గ దుస్తులు...వీటిపై రీసర్చ్ చేయడానికి ఒక పెద్ద టీం ఉందని విమర్శకులు అంటుంటారు.
అతను ఆర్మీ జవాన్లతో దీపావళిని జరుపుకుంటున్నా లేదా కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను విడిచిపెట్టినా, మోడీ దుస్తులు ఆ సందర్భానికి సరిపోయేట్టుగా ఉంటాయి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడి సాంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులే కాదు. రెండుముక్కలు స్థానిక భాష కూడా మాట్లాడతారు.
ఆయన మార్చే ఒక్కో డ్రస్సు ధర లక్షల్లో ఉంటుందని అంచనా. ఆయనవి ఫ్యాషన్ షోలని, ఆయన డ్రస్సుల కోసమే కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని, ప్రజా సమస్యలమీద కన్నా ఆయనకు వీటి మీదనే ఎక్కువ దృష్టి ఉందని విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన గానీ ఆయన మద్దతుదారులుగానీ పట్టించుకోరు. ఎన్నికల రాజకీయాల్లో తలపండిన వాళ్ళకు తప్ప ఈ దుస్తుల సిద్దాంతం అర్దం కాదని ఓ నవ్వు నవ్వి ఊరుకుంటారు.