గుజరాత్‌లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. - 8 మంది అరెస్టు
ఆమ్ ఆద్మీ పార్టీ.. `మోదీ హఠావో, దేశ్ బచావో` పేరుతో పోస్టర్ల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా 11 భాషలలో ప్రారంభించింది. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూతో పాటు గుజరాతీ, పంజాబీ, తెలుగు, బెంగాలీ, ఒరియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లోనూ పోస్టర్లు విడుదలయ్యాయి.
గుజరాత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారని 8 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘మోదీ హఠావో, దేశ్ బచావో’ పేరుతో పోస్టర్లు అంటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అనధికారిక పద్ధతిలో అభ్యంతరకర పోస్టర్లు అంటించారని పోలీసులు తెలిపారు.
దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ చీఫ్ ఇసుదన్ గాధ్వి స్పందిస్తూ.. అరెస్టయినవారు తమ పార్టీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. తమ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన పోస్టర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీటిని అంటించినట్టు వెల్లడించారు. ఈ అరెస్టులు బీజేపీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు. బీజేపీ భయపడుతోందనడానికి ఈ అరెస్టులు నిదర్శనమని స్పష్టంచేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ.. `మోదీ హఠావో, దేశ్ బచావో` పేరుతో పోస్టర్ల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా 11 భాషలలో ప్రారంభించింది. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూతో పాటు గుజరాతీ, పంజాబీ, తెలుగు, బెంగాలీ, ఒరియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లోనూ పోస్టర్లు విడుదలయ్యాయి.
గత వారం.. ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని వేలాది పోస్టర్లు దేశ రాజధానిలో గోడలపై కనిపించాయి. ఇది భారీ పోలీసు అణిచివేతకు దారితీసింది. ఈ వ్యవహారంలో 49 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ కలిగివున్నవారు కావడం గమనార్హం. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు, చట్ట ప్రకారం పోస్టర్లు ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ పేరు లేకపోవడంతో అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ అరెస్టులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. స్వాతంత్య్రోద్యమ సమయంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన వారిని బ్రిటీష్ వారు కూడా అరెస్టు చేయలేదన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా స్వాతంత్య్ర సమరయోధులు పోస్టర్లు అంటించేవారని, బ్రిటీష్ ప్రభుత్వం వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లూ నమోదు చేయలేదని, చర్యలు తీసుకోలేదని కేజ్రీవాల్ అన్నారు. బ్రిటీష్ పాలనలో భగత్ సింగ్ చాలా పోస్టర్లు అతికించారని, ఆయనపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆయన గుర్తు చేశారు.