చికిత్స పేరుతో యువతి తలలో 70 సూదులు గుచ్చిన మాంత్రికుడు
అనారోగ్యం పేరుతో డాక్టర్ దగ్గరికి కాకుండా ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లినందుకు ఓ యువతి తలలో 70 సూదులను దించాడు ఆ మోసగాడు.
దేశంలో ఇంకా మూఢనమ్మకాలు మిగిలి ఉన్నాయి అనటానికి ఈ ఘటన ఒక నిదర్శనం. విద్య , వైద్య పరంగా మనం అభివృద్ధి జరిగింది అనే మాట ఎంత అబద్ధమొ దులిపే ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. అనారోగ్యం పేరుతో డాక్టర్ దగ్గరికి కాకుండా ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లినందుకు ఓ యువతి తలలో 70 సూదులను దించాడు ఆ మోసగాడు. అయితే సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది.
పోలీసులు ఇచ్చిన వివరాలు ప్రకారం, ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో ఇచ్‌గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా అనే యువతి మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తండ్రి బిష్ణు బెహరా స్థానికంగా ఉండే తేజ్‌రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. వైద్యం పేరిట తేజ్‌రాజ్ విడతలు, విడతలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. అయితే ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు వింసార్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై పదుల సంఖ్యలో సూదులు ఉన్నట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటికి తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూసులు లోనికి వెళ్లలేదనీ.. దాంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలి కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మాంత్రికుడు తేజ్‌రాజ్‌ను అరెస్ట్ చేశారు.