లక్నో జైల్లో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ
గత ఐదేళ్లలో ఈ జైలులో ఇంతపెద్ద మొత్తంలో హెచ్‌ఐవీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
జైల్లో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జైలులో ఈ ఉదంతం చోటుచేసుకుంది. డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో కూడా 36 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలగా, తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆ సంఖ్య మరింత పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే హెచ్‌ఐవీ జైలులో ఎలా వ్యాప్తి చెందిందనే విషయంపై స్పష్టత కొరవడింది.
జైలులో ఉన్న ఖైదీల్లో చాలామందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్‌ని ఇంజక్షన్ రూపంలో శరీరంలోకి ఎక్కించుకునేందుకు ఒకే సిరంజిని ఎక్కువమంది వాడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బాధితులందరికీ లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
గత ఐదేళ్లలో ఈ జైలులో ఇంతపెద్ద మొత్తంలో హెచ్‌ఐవీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. లక్నోలో ఒకేసారి పెద్ద సంఖ్యలో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవడంతో ఇక్కడి మిగిలిన ఖైదీల ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల సంఖ్య పెరగకుండా వైద్యారోగ్యశాఖ సూచన మేరకు నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.