ఆ కుటుంబాలపై పిడుగుల వాన.. ఒకేరోజు 38 మంది మృతి

తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Advertisement
Update:2024-07-12 10:48 IST

పిడుగులు పడి ఒక్క రోజులో ఏకంగా 38 మంది మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. మృతుల్లో దాదాపు అందరూ పనులు చేసుకునేవారు, వారి కుటుంబసభ్యులే కావడం గమనార్హం. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు ప‌డ‌టంతో ఈ మరణాలు సంభవించాయి.

ఇక ప్రతాప్‌ గఢ్‌లో అత్యధికంగా 11 మంది మృతిచెందగా, సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలిలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌లో నలుగురు, ఔరయ్యా, డియోరియా, వారణాసి, సిద్దార్థనగర్, హత్రాస్‌ ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగులు పడటం వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరుగాక అనేకమందికి పిడుగుల ప్రభావంతో కాలిన గాయాలయ్యాయి.

తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో 13, 15 ఏళ్లున్న ఇద్దరు సహా చాలా మంది పొలంలో పనిచేస్తున్నారు. ఆ సమయంలో పిడుగులు పడటంతో వాటి ప్రభావానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుల్తాన్‌పూర్‌లో వరినాట్లు వేస్తుండగా కొందరు, మామిడి కాయలు కోసేందుకు వెళ్లి ఒకరు, తాగునీరు తెచ్చేందుకు వెళ్లి మరొకరు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు. ఇదేవిధంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. డియోరియాలో పొలంలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తుండగా పిడుగుపడి 5 ఏళ్ల బాలిక మృతిచెందడం మరో దారుణం.

ఇక పిడుగుపాటుకు గురై గాయాలపాలైన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్, దాని పరిసర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. 

Tags:    
Advertisement

Similar News