30 రోజుల భారత్ జోడో యాత్ర: వైరలవుతున్న ప్రధాన ఆకర్షణలు
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్రకు నిన్నటికి నెల పూర్తయ్యింది.ఈ నెల రోజుల పాద యాత్రలో కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం...
కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర నిన్నటితో ఒక నెల పూర్తయింది. ఈ పాదయాత్ర ముగియడానికి మరో నాలుగు నెలల సమయం ఉంది. ఈ నెల రోజుల పాద యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో ప్రసంగాలతోనూ, వ్యవహార తీరుతోనూ అనేక సందర్భాలలో ప్రజల మనసులు దోచుకున్నారు. దీంతో ఆయన పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. ఈ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాత్రలో అత్యంత విశేషమైన క్షణాలలో ఒకటి, కుండపోత వర్షంలో కూడా రాహుల్ గాంధీ ప్రసంగించడం, దీంతో ఆయన్ను జనం మరింత ఉత్సాహపరిచారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అత్యంత విపరీతంగా వైరల్ అయిన సందర్భాలు ఏంటో చూద్దాం.
1. వర్షంలో ప్రసంగిస్తూ..
మైసూరు పర్యటనలో రాహుల్ గాంధీ కుండపోత వర్షంలో ప్రసంగించినప్పుడు, రాజావారు అతనిని ఉత్సాహపరిచి, మద్దతుగా నినాదాలు చేయడం భారత్ జోడో యాత్ర లో అత్యంత చర్చనీయాంశమైంది. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, అంకితభావంతో రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారని పలువురు ప్రశంసించారు.
2. రాహుల్ గాంధీ తల్లి సోనియా షూ లేస్‌లు కడుతూ..
సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు తల్లీ కొడుకుల అనుబంధానికి అంతా ముగ్దులయ్యారు. రాహుల్ గాంధీ నేల పైన కూర్చుని తన తల్లి షూలేస్‌లు కట్టడం అత్యంత వైరల్‌గా మారింది.
3. సిద్ధరామయ్యతో జోడీగా ..
ఇతర కాంగ్రెస్ నాయకులంతా యాత్రతో కలిసి నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేయి పట్టుకుని, తనతో పాటు నడిపించడం పలువురని ఆకర్షించింది. సిద్దూ కూడా ఉత్సాహంగా రాహుల్ తో కలిసి పరుగు పెట్టడంతో మరింత ఉత్సాహం నెలకొంది.
4. హిజాబ్ ధరించిన అమ్మాయితో చేయి కలుపుతూ..
ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలోనే జోడో యాత్రలో, రాహుల్ గాంధీ చేయి పట్టుకుని హిజాబ్ ధరించిన ఒక యువతి పక్కన నడవడం కూడా ప్రశంసలు అందుకుంది. అయితే దీనిని పలువురు బిజెపి నాయకులు విమర్శించారు. రాహుల్ మైనారిటీల మెప్పుకోసం చేశాడంటూ బిజెపి నాయకులు విమర్శించారు.
5.. రాహుల్ గాంధీ వైరల్ టీ-షర్ట్
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ లగ్జరీ బ్రాండ్ బర్‌బెర్రీకి చెందిన టీ-షర్ట్ ధరించిన ఫోటోను బీజేపీ పోస్ట్ చేసింది. దీని ధర రూ. 40,000. పేదరికం, నిరుద్యోగం అంటూ యాత్రలో ఆయన ఖరీదైన టీ షర్ట్ ధరించడంపై బిజెపి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది