పది రోజుల్లో ముగ్గురు చిన్నారులను చంపేసిన చిరుత

ఈ ముగ్గురు చిన్నారులపై ఒకే చిరుత దాడి చేసినట్లు గాడ్వా డివిజన్ అటవీశాఖ అధికారి శశికుమార్ తెలిపారు. అడవి దాటి వచ్చిన చిరుత ఈ రెండు జిల్లాల పరిధిలో వరుసగా దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

Advertisement
Update:2022-12-20 18:16 IST

చిరుత పులి వరుస దాడులతో జార్ఖండ్ రాష్ట్రంలోని రెండు జిల్లాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి, పొలం పనులు చేసుకోవడానికి కూడా జంకుతున్నారు. కేవలం మూడు రోజుల్లో ముగ్గురు చిన్నారులను ఓ చిరుత చంపేసింది. తాజాగా గాడ్వా జిల్లాలోని పలామూ డివిజన్లో సేవదీ అనే గ్రామంలో ఓ ఆరేళ్ల బాలిక మూత్ర విసర్జన కోసం ఇంటి నుంచి బయటకు రాగా .. ఆ చిన్నారిపై చిరుత దాడి చేసింది. బాలిక మెడ పట్టుకొని అడవిలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించింది.

ఇది గమనించిన గ్రామస్తులు కర్రలు చేత పట్టుకొని చిరుత వెంటపడ్డారు. గ్రామస్తులు చుట్టుముట్టడంతో చిరుత ఆ చిన్నారిని వదిలేసి వెళ్ళిపోయింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది. చిరుత దాడిలో కేవలం పది రోజుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈనెల 14వ తేదీన అదే జిల్లాకు చెందిన భాందారియా ప్రాంతంలో చిరుత జరిపిన దాడిలో ఆరేళ్ల బాలిక చనిపోయింది. అలాగే డిసెంబర్ 10వ తేదీన గాడ్వా జిల్లాను ఆనుకుని ఉండే లాతేహర్ జిల్లాలో 12 ఏళ్ల బాలిక చిరుత దాడిలో మృతి చెందింది.

అయితే ఈ ముగ్గురు చిన్నారులపై ఒకే చిరుత దాడి చేసినట్లు గాడ్వా డివిజన్ అటవీశాఖ అధికారి శశికుమార్ తెలిపారు. అడవి దాటి వచ్చిన చిరుత ఈ రెండు జిల్లాల పరిధిలో వరుసగా దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తగిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వరుస దాడులకు పాల్పడుతున్న చిరుతను మనుషులను తినే జంతువుగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News