హైకోర్టుకు వెళ్లి మరీ తండ్రికి అవయవదానం చేసిన చిన్నారి

తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు 17ఏళ్ల దేవానంద ముందుకొచ్చింది. తాను లివర్‌లో కొద్ది భాగం తన తండ్రికి ఇస్తానని వైద్యులను కోరింది.

Advertisement
Update:2023-02-19 09:01 IST

తన తండ్రిని కాపాడుకునేందుకు 17 ఏళ్ల బాలిక న్యాయపోరాటం చేసింది. తండ్రికి కాలేయం దానం చేసి కాపాడుకుంది. తండ్రిపై బాలిక చూపిన ప్రేమకు ఆస్పత్రి యాజమాన్యం కూడా చలించిపోయింది.

పీ. జీ. ప్రతీష్ వయసు 48ఏళ్లు. కేరళలోని త్రిస్సూర్‌లో కాఫీ షాపు నడుపుతున్నారు. ఇటీవల ఆయన కాలేయం దెబ్బతింది. కాలేయం మార్పిడి చేయకపోతే బతకడం కష్టమని చెప్పారు. కాలేయంలోని కొద్ది భాగాన్ని ఎవరైనా దానం చేస్తే బతకడం సాధ్యమ‌ని చెప్పారు. కాలేయం దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు 17ఏళ్ల దేవానంద ముందుకొచ్చింది. తాను లివర్‌లో కొద్ది భాగం తన తండ్రికి ఇస్తానని వైద్యులను కోరింది. కానీ, ఆమె మైనర్ కావడంతో చట్టప్రకారం కాలేయం దానం సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. దాంతో దేవానంద కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

తన కళ్ల ముందే తన తండ్రి చనిపోతుంటే చూస్తూ ఉండలేనని.. తన తండ్రిని బతికించుకోవడానికి తనకున్న ఒకే మార్గం లివర్‌ దానం చేయడమేనని కాబట్టి అందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. కోర్టు ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించింది. పరీక్షలు చేసిన వైద్యుల బృందం లివర్ దానం చేసినా దేవానంద ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదని రిపోర్టు ఇచ్చింది.

ఆ నివేదిక ఆధారంగా తండ్రికి కాలేయ దానం చేసేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేరళ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రాజగిరి ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు వైద్యులు. తండ్రిని కాపాడుకునేందుకు అమ్మాయి చూపిన ధైర్యానికి, తపనకు గాను ఆస్పత్రి యాజమాన్యం వైద్య ఖర్చులను మాఫీ చేసింది. చిన్నారిని వైద్యులు సత్కరించారు.

చట్ట ప్రకారం మనదేశంలో 18ఏళ్ల లోపు వారు అవయవదానం చేయడానికి లేదు. కోర్టును ఆశ్రయించి ప్రత్యేక అనుమతులు సాధించి కాలేయం దానం చేసిన దేవానంద ఇప్పుడు దేశంలోనే అవయవదానం చేసిన అతిచిన్న వయసున్న వ్యక్తిగా నిలిచారు. దేవానంద ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

Tags:    
Advertisement

Similar News