అత్యాచారానికి పాల్పడ్డ యువకుడికి బాలికతో వివాహం.. కేరళలో ఘటన

అతడిని చట్టపరంగా ఎదుర్కోవడం తమ వల్ల కాదని నిర్ణయించుకున్న బాధితురాలి తల్లిదండ్రులు బాలికను అతడికే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ నెల 18న వారిద్దరికీ వివాహం జరిపించారు.

Advertisement
Update:2023-01-26 17:01 IST

ఒకసారి కాదు రెండుసార్లు కాదు పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కొన్ని నెలల జైలు శిక్ష తర్వాత బయటికి వచ్చిన ఆ యువకుడు మళ్లీ అదే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువకుడిని చట్టపరంగా ఎదుర్కోలేని తల్లిదండ్రులు చేసేదేమీ లేక బాలికను అతడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.

తిరువనంతపురం జిల్లా నేడుమంగడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన పదహారేళ్ల బాలికపై 23 ఏళ్ల అమీర్ 2021లో పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అమీర్ కొన్ని నెలలపాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత అతడు బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అమీర్ లో ఎటువంటి మార్పు రాలేదు. మళ్లీ బాలిక ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అమీర్ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. మాఫియాతో కూడా అతడికి సంబంధాలు ఉన్నాయి. దీంతో అతడిని చట్టపరంగా ఎదుర్కోవడం తమ వల్ల కాదని నిర్ణయించుకున్న బాధితురాలి తల్లిదండ్రులు బాలికను అతడికే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ నెల 18న వారిద్దరికీ వివాహం జరిపించారు.

ఇదిలా ఉండగా.. సదరు బాలిక కొద్దిరోజులుగా స్కూల్‌కు రాకపోవడంతో ఏం జరిగిందని టీచర్లు ఆరా తీశారు. దీంతో వారికి విషయం తెలిసింది. దీనిపై వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను పెళ్లి చేసుకున్న అమీర్, పెళ్లి తంతు జరిపించిన ఉస్తాద్ అన్వర్, బాలిక తండ్రిని అరెస్టు చేశారు. ఐపీసీ, పోక్సో చట్టం, బాల్య వివాహ నిషేధచట్టంలోని పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News