కుటుంబంలోని నలుగురిని నరికి చంపిన 13 ఏళ్ల బాలుడు
గొడ్డలితో నరికే సమయంలో వారు గట్టిగా అరిచినా బయటకు వినపడకుండా భారీ శబ్దంతో మ్యూజిక్ పెట్టి హత్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత మృతదేహాలను ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టి పారిపోయాడు.
సినిమాలు, క్రైమ్ షోల ప్రభావంతో పెన్ను పట్టుకుని పాఠాలు రాసుకోవాల్సిన పిల్లలు కత్తులు పట్టుకొని ప్రాణాలు తీస్తున్నారు. తెలిసీ తెలియని వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. త్రిపురలో 13 ఏళ్ల బాలుడు తల్లితో సహా మొత్తం నలుగురిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముక్కు పచ్చలు ఆరని పిల్లాడు గొడ్డలి చేత పట్టుకొని అమానుషంగా తల్లి, తాత, సోదరి, మరో బంధువైన మహిళను నరికి చంపడం కలకలం సృష్టించింది.
త్రిపురలోని కమల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి దురై శివబారిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 13 ఏళ్ల బాలుడు తల్లి సమిత(32), సోదరి సుపర్ణ (10), తాత బాదల్ దేబ్ నాథ్ (70), మరో బంధువు రేఖ(42)లను గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపాడు. గొడ్డలితో నరికే సమయంలో వారు గట్టిగా అరిచినా బయటకు వినపడకుండా భారీ శబ్దంతో మ్యూజిక్ పెట్టి హత్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత మృతదేహాలను ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టి పారిపోయాడు.
ఈ సంఘటన జరిగిన సమయంలో బాలుడి తండ్రి ఇంట్లో లేడు. ఆ తర్వాత అతడు ఇంటికి చేరుకోగా గదుల్లో రక్తపు మరకలు కనిపించాయి. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టిన మృతదేహాలను వెలికి తీశారు. ఆదివారం ఉదయం నిందితుడిని అరెస్టు చేసినట్లు కమల్ పూర్ పోలీసులు తెలిపారు.
కాగా ఈ హత్యలకు ముందు బాలుడు ఇంట్లో దొంగతనానికి పాల్పడగా కుటుంబీకులు మందలించినట్లు సమాచారం. ఈ కారణంతోనే బాలుడు హత్యలకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హత్యలకు పాల్పడ్డ బాలుడికి టీవీల్లో క్రైమ్ షోలు చూస్తూ ఎంజాయ్ చేసే అలవాటు ఉందని స్థానికులు తెలిపారు. 13 ఏళ్ల బాలుడు ఇంట్లో వాళ్లను గొడ్డలితో తెగ నరకడం తీవ్ర కలకలం సృష్టించింది