కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది దుర్మరణం

కర్ణాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisement
Update: 2024-06-28 07:12 GMT

కర్ణాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక గుండేనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్ లో ఉన్న 13 మంది మరణించారు.

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోని మృతులను శివమొగ్గ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు

మినీ బస్సులోని వారంతా బెళగావి జిల్లా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మొత్తం ఈ వాహనంలో 17 మంది ఉండగా 13 మంది అక్కడికక్కడే మరణించారు.


గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మినీ బస్సు డ్రైవర్ అతివేగం, నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో.. మినీ బస్సు ఘోరంగా ధ్వంసమైంది. మృతదేహాలు లారీకి, బస్సుకి మధ్యలో ఇరుక్కుపోవడంతో నుజ్జు నుజ్జు అయిపోయాయి. వాటిని బయటకు తీయడానికి అగ్నిమాపక శాఖ, పోలీసు సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News