ఈ చిన్నారులకు అంత ద్వేషం నూరి పోస్తున్నదెవరు ? వాళ్ళ మెదళ్ళను కలుషితం చేస్తున్న నేరమెవరిది ?

బొమ్మలు ఇప్పిస్తానని ఆశ చూపి నిందితులు బాలుడిని మహాలక్ష్మి నగర్ సమీపంలోకి తీసుకెళ్లి మతపరమైన నినాదాలు చేయమని బలవంతం చేశారు. వారు తనను ఇష్టమొచ్చినట్టు కొట్టారని, తన బట్టలు విప్పించారని, తన మతానికి వ్యతిరేకంగా, వారి మతానికి అనుకూలంగా నినాదాలు చేయమని బలవంతం చేశారని బాధిత బాలుడు ఆరోపించాడు.

Advertisement
Update:2023-04-14 10:03 IST

చిన్నపిల్లల మనస్సులు తెల్లకాగితం లాంటివి. ఆ కాగితం మీద కుటుంబము, సమాజమూ రాసే రాతలే ఆ పిల్లలను మంచి వైపు లేదా చెడువైపు నడిపిస్తాయి. ద్వేషం, కుట్రలు, అబద్దాలు అధికారమై రాజ్యమేలుతున్న సమాజంలో పిల్లలు ఎలా తయారవుతారు ? ఈ దేశానికి, దేశ ప్రజలకు గొప్పగా ఉపయోగపడే గొప్ప సైంటిస్టులుగా, గొప్ప నాయకులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, జర్నలిస్టులుగా , ఇంకా అనేక ఉద్యోగాలతో, అనేక విధాల ప్రజల కోసం సమాజం కోసం పనిచేసే పౌరులుగా తయారు కావాల్సిన చిన్నారులు. చిన్నతనంలోనే మతం పేరుతో, కులం పేరుతో ద్వేషంతో, కుట్రలతో రగిలిపోతూ ఈ సమాజానికి చీడ‌పురుగులుగా తయారవుతున్నారనడానికి నిన్న మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటనే మంచి ఉదహరణ.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ముగ్గురు బాలలు ఓ 11 ఏళ్ల మైనార్టీ బాలుడిని కొట్టి, అతని బట్టలు విప్పించి మతపరమైన నినాదాలు చేయమని బలవంతం చేశారు. పైగా ఈ సంఘటనను వీడియోలో రికార్డ్ చేశారు.

ఇండోర్ లోని లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని నిపానియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి వాంగ్మూలం ప్రకారం, అతను స్టార్ స్క్వేర్ సమీపంలో ఆడుకుంటుండగా నిందితులైన ముగ్గురు బాలలు అతని వద్దకు వచ్చి బైపాస్‌లోని బెస్ట్ ప్రైస్ దగ్గర బొమ్మలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

బొమ్మలు ఇప్పిస్తానని ఆశ చూపి నిందితులు బాలుడిని మహాలక్ష్మి నగర్ సమీపంలోకి తీసుకెళ్లి మతపరమైన నినాదాలు చేయమని బలవంతం చేశారు. వారు తనను ఇష్టమొచ్చినట్టు కొట్టారని, తన బట్టలు విప్పించారని, తన మతానికి వ్యతిరేకంగా, వారి మతానికి అనుకూలంగా నినాదాలు చేయమని బలవంతం చేశారని బాధిత బాలుడు ఆరోపించాడు. బాధితుడు తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులపై కిడ్నాప్, గాయపర్చడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మధ్యప్రదేశ్ లో దుమారం రేగింది. బాధితుడికి సత్వర న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ప్రజలను పోలీసులు కోరారు.

అయితే ఆ ముగ్గురు చిన్నారులు అలా మరో మతాన్ని ద్వేషించే విధంగా వారి మెదళ్ళను కలుషితం చేసింది ఎవరు ? వారిని నేరస్తులుగా తయారు చేసిన కుట్రదారులెవరు ? ఓ చిన్నపిల్లవాడిని కుట్ర తో మరో చోటికి తీసుకెళ్ళడం, కొట్టడం, బట్టలు విప్పించి కొట్టడం, మతోన్మాద నినాదాలివ్వడం...ఇవన్నీ ఆ చిన్నారులకు ఎవరు నేర్పించారు? లేదా ఎవరిని చూసి వాళ్ళు ఇలా తయారయ్యారు?

హంతకులను, రేపిస్టులను నెత్తికెత్తుకొని, వారికి సన్మానాలు చేసి, వారిని జయ జయ ధ్వానాల మధ్య ఊరేగించి ఆ హంతకులు , రేపిస్టులు చాలా గొప్పవారని ప్రచారం చేసే కొన్ని గుంపులు ఇప్పుడు ఈ ముగ్గురు చిన్నారులను అలాగే చేయరనే నమ్మకమేంటి ? ఆ ముగ్గురు చేసిన పని చాలా గొప్పదని బహిరంగ సభలు పెట్టి మరీ రెచ్చగొట్టరని నమ్మగల‌మా ? ఆ ముగ్గురు నిందితులు జువెనైల్ హోమ్ నుంచి విడుదల కాగానే వారిని తలకెత్తుకొని ఊరేగింపులు తీసి, బహిరంగ సభలు పెట్టి ఆ ముగ్గురు చేసిన పనిని కీర్తించి వారిని మరింత కరుడుగట్టిన మతోన్మాదులుగా, నేరస్తులుగా తయారు చేయవద్దని ఆశిద్దాం.

Tags:    
Advertisement

Similar News