రాజ్యసభలో ఆ 10 స్థానాలు ఖాళీ.. త్వరలో ఎన్నికలకు ఏర్పాట్లు
లోక్‌సభకు ఎన్నికైన వారిలో ముగ్గురికి కేంద్రంలో మంత్రి పదవులు కూడా దక్కాయి. నరేంద్ర మోదీతో పాటు వీరంతా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
రాజ్యసభ సభ్యులు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో వాటిని భర్తీ చేసేందుకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటన చేయనుంది. మొత్తం 10 స్థానాలు ఈ విధంగా ఖాళీ అయినట్టు రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా వెల్లడించింది. వారంతా 18వ లోక్‌సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్ 4 నుంచి వారి రాజ్యసభ సభ్యత్వం నిలిచిపోయిందని తెలిపింది. అస్సాం, బిహార్, మహారాష్ట్రల నుంచి రెండు చొప్పున, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాజ్యసభ సభ్యులుగా ఉంటూ లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించినవారిలో కామాఖ్య ప్రసాద్ తాసా, సర్బానంద సోనోవాల్ (అస్సాం), మీసా భారతి, వివేక్ కుమార్ (బిహార్), ఉదయన్‌రాజే భోంస్లే, పీయూష్ గోయల్ (మహారాష్ట్ర), దీపేందర్ సింగ్ హుడా (హరియాణా), కేసీ వేణుగోపాల్ (రాజస్థాన్), బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్) ఉన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది.
లోక్‌సభకు ఎన్నికైన వారిలో ముగ్గురికి కేంద్రంలో మంత్రి పదవులు కూడా దక్కాయి. నరేంద్ర మోదీతో పాటు వీరంతా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం వారికి శాఖల కేటాయింపు జరిగింది. పీయూష్ గోయల్‌కు వాణిజ్యం, పరిశ్రమలు, సర్బానంద సోనోవాల్‌కు నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా, జ్యోతిరాదిత్య సింధియాకు కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, టెలికాం శాఖ కేటాయించారు.