సంకెళ్లతో భారత వలసదారులు
ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేసిన అమెరికా సరిహద్దు గస్తీ విభాగం చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారులతో అమెరికా అధికారులు అమానవీయంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. దానిని యూఎస్ అధికారి షేర్ చేశారు. అక్రమవలసదారుల్ని విజయవంతంగా భారత్‌కు తరలించామని పోస్టు పెట్టారు.
అమెరికా సరిహద్దు గస్తీ విభాగం చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా తిరిగి పంపించివేశాం. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అనుసరిస్తున్న నిబద్ధతను ఈ మిషన్ వెల్లడిస్తున్నదని తన పోస్టులో పేర్కొనన్నారు. అక్రమంగా సరిహద్దులు దాటితే.. పంపేస్తామంటూ హెచ్చరికలు చేశారు. ఆ వీడియోలో సీ-17 విమానం డోర్ తెరిచి ఉన్నది. కాళ్లకు గొలుసులు కట్టి ఉన్న వలసదారుల వరుసలో నడుస్తూ ఆ విమానం డోర్ వైపు వెళ్లడం కనిపించింది. నేరస్థులను తీసుకెళ్లినట్లుగా వారిని విమానంలోకి తరలించారు. దాని వెనుక సైనికులు ఎక్కారు. మైఖెల్ పోస్టు ప్రకారం .. ఆ భారతీయుల విమానం టెక్సాస్‌లో టేకాఫ్ అయి, అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది.
విపక్షాల విమర్శలపై ఇప్పటికే కేంద్రం స్పందించింది. అమెరికా నుంచి భారత్ వచ్చిన విమానంలో వలసదారుల కాళ్లకు గొలుసులు, చేతికి సంకెళ్లు ఉన్న దృశ్యాలు నిన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. వారిని నేరస్థులుగా పంపడం అవమానకరమని, ఓ భారతీయుడిగా ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నానని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అవేదన వ్యక్తం చేశారు. ఇది చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్‌మెంట్ ఆ ఫొటోలపై నిజనిర్ధారణ ప్రక్రియ చేపట్టింది. ఇందులో అవి ఫేక్ అని తేలినట్లు పీఐబీ వెల్లడించింది.
అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న 205 మంది భారీతీయులను వెనక్కి పంపారు. టెక్సాస్ నుంచి సీ -17 సైనిక విమానంలో వారిని భారత్‌కు తరలించారు. ఆ విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్ సర్‌లో ల్యాండ్ అయ్యింది. అమెరికా అధ్యక్షడిగా డొనాల్డ్ ట్రంప్ పాలన పగ్గాలు చేపట్టగానే ఆ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపింది. ఈక్రమంలోనే 205 మంది భారతీయులను వెనక్కిపంపింది. అమెరికాలో 20, 407 మంది భారతీయులు అక్రమంగా నివాసముంటున్నారని గుర్తించారు. వారిలో 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ (ఈఆర్‌వో) కస్టడీలో ఉన్నారు. వారిని మినహా మిగిలిన 17,940 మందిని వెనక్కి పంపేందుకు అమెరికా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం 205 మంది స్వదేశానికి తిరిగి చేరుకోగా మిగిలిన వారిని తర్వలోనే వెనక్కి పంపేయనున్నారు. భారత్‌తో పాటు గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా వారి దేశాలకు వెనక్కి పంపేస్తుంది. వీసా గడువు ముగిసిన తర్వాత సరైన పత్రాలు లేకుండా ఇతర దేశాల్లో ఎవరైనా నివాసం ఉండటానికి తాము వ్యతిరేకమని భారత్ ఇదివరకే ప్రకటించింది. అలాంటి వారిని స్వదేశానికి తిరిగి తీసుకువస్తామని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది.