'బ్రిక్స్' ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే 100 శాతం సుంకం విధిస్తా
బ్రిక్స్ సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరిక
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల కూటమి 'బ్రిక్స్' ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై వందశాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్‌కు దూరంగా ఉండాలని చేస్తున్న ఆలోచనను తాము చూస్తూ ఊరుకునే పరిస్థితి ముగిసిందని తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. బ్రిక్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదన్న ట్రంప్.. ప్రపంచ వాణిజ్యంలో శక్తిమంతమైన డాలర్‌కు బదులు మరో కరెన్సీని తీసుకురాకూడదన్నారు. అందుకు బ్రిక్స్ దేశాలు తమ నిబద్ధతను చాటుకోవాలని సూచించారు. లేకుంటే ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఆ దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
రష్యాలో 2023లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కూటమిలోని దేశాలకు కీలక పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాలు తమ దేశ వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు జాతీయ కరెన్సీలలోనే చేయాలని సూచించారు. 2024 జూన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ రష్యా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ బ్రిక్స్ దేశాలకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.