అమెరికాకు అక్రమంగా వెళ్లిన భారతీయులు స్వదేశానికి
205 మంది భారతీయులను సీ-17 యూఎస్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తరలిస్తున్న అమెరికా
అక్రమవలసదారులపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన భారతీయులను విమానంలో వెనక్కి తరలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గంటల కిందట ఓ విమానం ఇండియాకు బయలుదేరింది. అందులో 205 మంది భారతీయులు ఉన్నారని నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
సీ-17 యూఎస్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ వీరిని తరలిస్తున్నది. భారత్‌కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అంచనా. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత తన స్పందన తెలియజేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేకరకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉన్నదని పేర్కొన్నది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడా ఉన్న వారిని తిరిగి తీసుకురావడానికి వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. త్వరలో ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తున్నారని సమాచారం. ఈ తరుణంలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల మొదటి విడుత తరలింపు జరుగుతున్నది.