అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు పాట
అమెరికా అధ్యక్ష ఎన్నికల భాగంగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ సరికొత్తగా ముందుకెళ్తున్నారు.
అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ దూసుకెళ్తున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. ఇక భారత మూలాలున్న కమలా హారీస్ కు భారీగానే సపోర్ట్ లభిస్తోంది. ప్రచారంలో భాగంగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ సరికొత్తగా ముందుకెళ్తున్నారు.
ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సాంగ్ తో ప్రచారానికి దిగారు. ఆర్‌ఆర్‌ఆర్ లోని 'నాటు నాటు' సాంగ్ హిందీ వెర్షన్ తో ఒక స్పెషల్ వీడియోను రూపొందించారు. ఈ పాటలో కమలా హారిస్ విజువల్స్ వచ్చేలా ఎలక్షన్ క్యాంపెయిన్ సాంగ్ ను క్రియేట్ చేశారు. ఆ వీడియోను ఇండియన్ అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భూటోరియా విడుదల చేయగా.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వీడియో లో సాంగ్ మధ్యలో భారతీయ మూలాలకు చెందిన పలువురు వ్యక్తుల కామెంట్స్ ను కూడా యాడ్ చేశారు. మరో విశేషం ఏంటంటే కమలా హారిస్‌కు ఓటు వేయాలని తెలుగులో కూడా డెమోక్రాటిక్ పార్టీ నేతలు అభ్యర్థించారు.
ఇక అమెరికాలో దక్షిణాసియాకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. పెన్సిల్వేనియా, నెవాడా, మిషిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, జార్జియా లాంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. సుమారు 60 లక్షల ఓట్లు సౌత్ ఏషియన్లవని తెలుస్తోంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. ఎవరివైపు వారు మద్దతిస్తే.. వాళ్లదే విజయం అనే ట్రెండ్ కొనసాగుతోంది.
కమలాహారిస్ తల్లి శ్యామల గోపాలన్ భారతీయ సంతతురాలు. ఆమె తండ్రి పీవీ గోపాలన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. 1958 లో శ్యామల ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లారు. రొమ్ము క్యాన్సర్ పై ఆమె అనేక పరిశోధనలు చేశారు. జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ ను శ్యామల వివాహం చేసుకున్నారు. వారి తొలి సంతానమే కమలా హారిస్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ జరగనున్నాయి.