ట్విట్టర్‌లో నయా బానిస పోకడలు
మస్క్ రెండు రకాల తంత్రాన్ని అమలు చేస్తున్నాడు. ట్విట్టర్‌ని కోనుగోలు చేశాక ఒకవైపున సగం మంది ఉద్యోగులను తొలగించారు. మరోవైపున వినియోగదారుల మీద భారం మోపుతూ బ్లూక్ టిక్ కోసం డబ్బులు చెల్లించాల్సిందేనని అన్నారు.
ట్విట్టర్‌లో కొనసాగాలంటే వారానికి 80 గంటలు పని చేయాలని ఎలన్ మస్క్ ఉద్యోగులకు ఆర్డర్ జారీ చేశాడు. అంటే రోజుకు దాదాపు 12 గంటలు. ఒక్కమాటలో చెప్పాలంటే వేతన బానిసలుగా పనిచేసేవారే తనకు కావాలని స్పష్టం చేశాడు మస్క్.
మార్కెట్ ఎకానమీలో ఏదీ స్థిరంగా ఉండదు, ఎవరికీ భద్రత ఉండదు. మార్కెట్ మాంత్రికుల చేతిలో బతుకు భారమై, పరాధీనమై నయా బానిసత్వానికి దారితీసే విపరిణామాన్ని ఎలన్ మస్క్ అనుసరిస్తున్న వాణిజ్య పోకడలు తేటతెల్లం చేస్తున్నాయి. రెండువారాల కిందటి వరకు సజావుగానే ఉన్నది ట్విట్టర్. మస్క్ కొనుగోలు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. ట్విట్టర్‌లో పనిచేస్తున్న 50శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు సంస్థలో కొనసాగుతున్న వారు వారానికి 80 గంటలు అంటే రోజుకు 12 గంటలు పని చేసితీరాలని, లేదంటే ఇంటికి వెళ్ళిపోండని ఎలన్ మస్క్ హుకుం జారీ చేశాడు. కనీసం ఒకపూట అన్నం కూడా సంస్థ పెట్టదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఎలాంటి రాయితీలు, అదనపు చెల్లింపులు ఆశించకుండా రోజుకు 12 గంటలు పనిచేయాలని మస్క్ ఆర్డర్లు జారీ చేయడం క్రూరమైన బానిస-యజమాని సంబంధాల్ని తలపిస్తుంది.
మార్కెట్ ఎకానమీలో ఎలన్ మస్క్ లాంటి గుత్త పెట్టుబడిదారులు ఎదిగిన కొద్దీ ఫ్యూడల్ ప్రభువుల కన్నా దుర్మార్గంగా వ్యవహరిస్తారు. లిబరలిజానికి ప్రాతినిధ్యం వహించే పెట్టుబడిదారీ విధానంలో ఫ్యూడల్ పోకడల ప్రతినిధి ఎలన్ మస్క్. మస్క్‌ది కరడుగట్టిన క్రూర వాణిజ్యం. ఉద్యోగాల్లోంచి వేలమందిని తొలగించడం, తొలగించిన పద్ధతిలోని క్రౌర్యం కార్పోరేట్ ప్రపంచంలో ఊహించడానికి వీల్లేనిది. ఒక ఉద్యోగి రాజీనామా చేయదలుచుకుంటే రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వాలని చెబుతారు. కానీ తాము కాదనుకుంటే నువ్వు దారిలో ఉంటే ఆఫీసుకే రాకు, వెనక్కివెళ్ళిపో నిన్ను డిస్మస్ చేసామని ఈమెయిల్ పంపడం మార్కెట్ ఎకానమీలో కార్పోరేట్ల దాష్టీకాన్ని, దౌర్జన్యాన్ని తెలియజేస్తున్నది. అందుకే ఏనాడో మార్క్స్ చెప్పారు ` కార్పోరేట్ ప్రపంచంలో వైట్‌కాలర్ ఉద్యోగులు 'వేతన బానిసలు' అని. బానిసలకు ఎలాంటి హక్కులుండవు. గంటల తరబడి పనిచేయాల్సిందే. వారికి ఎలాంటి వసతి, సౌకర్యాలు ఉండవు. ఇదే కదా గ్లోబలైజేషన్‌లో ఎలన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్‌ల వాణిజ్య పోకడల కుతంత్రం. మెటా నుంచి 11వేల మందిని రాత్రికి రాత్రి తొలగించడాన్ని కుటిల వ్యాపార పోకడల పర్యవసానమని గ్రహించాలి.
మస్క్ రెండు రకాల తంత్రాన్ని అమలు చేస్తున్నాడు. ట్విట్టర్‌ని కోనుగోలు చేశాక ఒకవైపున సగం మంది ఉద్యోగులను తొలగించారు. మరోవైపున వినియోగదారుల మీద భారం మోపుతూ బ్లూక్ టిక్ కోసం డబ్బులు చెల్లించాల్సిందేనని అన్నారు. బ్లూ టిక్ చార్జీలను భారతదేశంలో నెలకు 719 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రకమైన పద్ధతుల్లో ట్విట్టర్‌ని నష్టాల్లోంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేయాలన్నది మస్క్ వ్యూహం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఉద్యోగుల మీద పని భారం మోపడం పట్ల విభిన్నవర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
133 ఏళ్ళ కిందట అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికులు వీధుల్లోకి వచ్చారు. పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు. స్వేచ్ఛాధామంగా, మానవ హక్కులకీ, ప్రజాస్వామ్యానికీ కాణాచిగా చెబుతున్న అమెరికాలో ఇవాళ మస్క్ ఏకపక్ష చర్యలకు వ్యతిరేకంగా అనేకమంది కోర్టుకెక్కారు. ఆర్థికమాంద్యం, సంక్షోభం పేరుతో పని గంటలు పెంచడం మానవహక్కులకు విఘాతం. మానవముఖం లేని మార్కెట్ ఎకానమీలో ఏకస్వామ్యం పెచ్చరిల్లితే వాటిల్లే దుష్పరిణామాలకు నిదర్శనం ట్విట్టర్, ఎలన్ మస్క్‌ల ఉదంతం.