లిబియాలో బద్దలైన డ్యామ్‌లు - 2 వేల మంది మృతి.. 6 వేల మంది గల్లంతు
ఈ స్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని లిబియా ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ అథారిటీ చీఫ్ ఒసామా అల్యా పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడం వల్ల ఈ ముప్పు వాటిల్లిందని తెలిపారు.
ఆఫ్రికా దేశమైన లిబియాలో భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరద తీవ్రస్థాయికి చేరడంతో రెండు డ్యామ్‌లు బద్దలయ్యాయి. దీంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తి 2 వేల మంది మృతిచెందారు. మరో 6 వేల మంది ఆచూకీ గల్లంతైంది. పోటెత్తిన వరద సమీపంలోని సముద్రంలోకి ప్రవహించగా, జనం అందులో కొట్టుకుపోయారు. ఈ వరద కారణంగా నివాస ప్రాంతాలు కూడా ఊడ్చిపెట్టుకుపోయాయి.
లిబియా ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మిస్మారి ఈ జల ప్రళయంపై మాట్లాడుతూ.. వరదలకు 3 వంతెనలు కూడా కొట్టుకుపోయాయని తెలిపారు. సముద్ర తీరంలోని పర్వతాల వద్ద ఉన్న డెరా నగరం ఈ జలప్రళయానికి తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ నివాస గృహాలు చాలావరకు పర్వత లోయలో ఉండగా, దీని సమీపంలోని ఒక డ్యామ్ బద్దలై ఆ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు ఒక్కసారిగా చొచ్చుకొచ్చింది. దీంతో ప్రజలు తప్పించుకునేందుకు కూడా అవకాశం లేకపోయింది. ప్రస్తుతం ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా నిలిచిపోవడంతో వరద ప్రాంతంలో పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలిసే అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
లిబియా ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ అథారిటీ చీఫ్ ఒసామా అల్యా దీనిపై మాట్లాడుతూ.. ఈ స్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడం వల్ల ఈ ముప్పు వాటిల్లిందని తెలిపారు. సముద్ర మట్టం, వరద, గాలి వేగం వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేదని చెప్పారు. తూర్పు తీరంలోని అల్ బైడ, అల్ మర్జ్, తుబ్రోక్, టాకెనిస్, బెంగ్ హజి నగరాలు కూడా వరదలకు ప్రభావితమయ్యాయి. లిబియాలోని తమ కార్యాలయం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందని ఐరాస వెల్లడించింది. చాలా దేశాలు తమ సహాయక బృందాలను లిబియాకు తరలించాయి.