తెలుగు ప్ర‌జ‌ల డ‌బ్బులు తింటూ.. మ‌ళ్లీ నింద‌లా..?

మిగిలిన కార్డులతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే సొంత డబ్బులతో మిగిలిన కార్డులకు బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు ఏటా 3వేల 800 కోట్లను రాష్ట్రం భరిస్తోంది.

Advertisement
Update:2022-09-03 10:14 IST

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు కలిసి తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీదే మనుగడ సాగిస్తున్నాయన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడి జీవనం సాగించడం లేదు. తెలుగు రాష్ట్రాలే కేంద్రానికి అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నాయి. అయినా సరే నిర్మలా సీతారామన్, ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు ఏపీకి వచ్చినా, తెలంగాణకు వచ్చినా ఇక్కడి పథకాలన్నీ కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు.

రేషన్ బియ్యం విషయంలోనూ నిర్మలా సీతారామన్ అదే పనిచేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా రేషన్ బియ్యం పంపిణీ విషయంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు భారీగా భారాన్ని మోస్తున్నాయి. తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షల 40వేలు. కానీ కేంద్రం బియ్యం ఇస్తోంది కేవలం 53 లక్షల కార్డులకు మాత్రమే. మిగిలిన కార్డులతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే సొంత డబ్బులతో మిగిలిన కార్డులకు బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు ఏటా 3వేల 800 కోట్లను రాష్ట్రం భరిస్తోంది.

ఎంతమంది ఉన్నా సరే ఒక కుటుంబంలో నలుగురికి మాత్రమే కేంద్రం బియ్యం ఇస్తుంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో కుటుంబంలో ఎంత మంది ఉన్నా సరే బియ్యాన్ని ఇస్తోంది. అసలు మొత్తం నిధుల సంగతి చూసినా.. 2014 నుంచి ఇప్పటి వరకే తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో మొత్తం రూ. 3 లక్షల 65వేల కోట్లు వెళ్లింది. తిరిగి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం లక్షా 96వేల కోట్లు మాత్రమే. ఇన్ని లక్షల కోట్లు అదనంగా దేశానికే తెలంగాణ పంపుతున్నా.. బీజేపీ నేతల తీరు మాత్రం తామే తెలంగాణను బతికిస్తున్నామన్నట్టుగా ఉంటోంది.

ఏపీలో బియ్యం సంగతి ఇంతే. నిర్మలా సీతారామన్ గతేడాది విశాఖలోనూ రేషన్ షాపును పరిశీలించి మోడీ ఫొటో లేదంటూ వాగ్వాదానికి దిగారు. కానీ ఏపీలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య కోటి 45 లక్షలు. కేంద్రం గుర్తించిన కార్డుల సంఖ్య 86 లక్షలు మాత్రమే. ఆ కార్డులకు మాత్రమే కేంద్రం బియ్యం ఇస్తుంది. మిగిలిన 60 లక్షల కార్డులకు ఏపీ ప్రభుత్వమే భరిస్తూ బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డులను గుర్తించాలని ఎంతగా విన్నవించినా కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది.

ఇక మాటకు ముందు ఆయుష్మాన్‌ భారత్ పథకాన్ని కేంద్ర పెద్దలు ప్రస్తావిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. ఏపీలో ఆరోగ్య శ్రీ నిధులన్నీ తామిస్తున్న ఆయుష్మాన్ భారత్ నిధులే అని మాట్లాడారు. ఆయుష్మాన్‌ కింద కేంద్రం ఏపీకి ఇచ్చింది 230 కోట్లు మాత్రమే. అదే ఆరోగ్య శ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది గతేడాది 2400 కోట్లు. కేంద్రం ఇచ్చిన నిధులతోనూ ఆరోగ్యశ్రీని నడపడం కాదు కదా.. చికిత్సకు అవసరమైన కాటన్‌ కూడా రాదని గతంలోనే పేర్నినాని విమర్శించారు.

తెలంగాణలోనూ ఆరోగ్య శ్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 858 కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్రం ఇచ్చింది గతేడాది 150 కోట్లు మాత్రమే. పైగా ఆరోగ్య శ్రీ కింద తెలంగాణలో 90 లక్షల కుటుంబాలు కవర్ అవుతుంటే.. కేంద్రం తెచ్చిన ఆయూష్మాన్ భారత్ పథకం కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే వర్తిస్తుంది.

చట్టప్రకారం కేంద్రం విధించే పన్నుల్లోనూ రాష్ట్రాలకు వాటా పంచాలి. ఆ లెక్కన పెట్రోల్, డీజిల్‌ అమ్మకాల ద్వారా రాష్ట్రాలకు లక్షల కోట్ల వాటా రావాల్సి ఉంది. రాష్ట్రాలకు వాటా ఎగ్గొట్టాలన్న దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. సెస్‌ల రూపంలో వసూలు చేసే నిధులకు రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ దొడ్డిదారిని ఎన్నుకుని.. రాష్ట్రాలను నిర్వీర్యం చేసే పనిని మోడీ సర్కార్ చేస్తోంది. బియ్యం కానీ, మరే పథకం నిధులుగానీ.. తెలుగు రాష్ట్రాలు భిక్షగా తీసుకునే స్థితిలో లేవు. తీసుకుంటున్న దాని కంటే అధికంగా కేంద్రానికి నిధులు అందిస్తున్న రాష్ట్రాలు ఇవి.

Tags:    
Advertisement

Similar News