హైఎండ్ బైక్‌లు, కార్ల ధరలు తగ్గే అవకాశం
కస్టమ్ సుంకం రేట్లను క్రమబద్ధీకరించిన కేంద్ర ప్రభుత్వం
కస్టమ్ సుంకం రేట్లను కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఇంతకుముందు సుంకాల సంఖ్య 15గా ఉండగా, ఎనిమిదికి పరిమితం చేసింది. చాలావరకు వస్తువులపై సుంకాన్ని ఇదివరకు స్థాయిలోనే ఉండేలా సెస్‌ను సర్దుబాటు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7 టారిఫ్ రేట్లను తొలిగించడంతో, ఎనిమిది టారిఫ్ రేట్లకు పరిమితమయ్యాయి. ఇందులో సున్నా రేటూ కలిసి ఉన్నది.
సబ్బులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, పాదరక్షలు వంటి ఉత్పత్తులకు ఉండే 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం కస్టమ్స్ టారిఫ్ శ్లాబులను 20 శాతం శ్లాబులోకి కలిపారు. లాబోరేటరి రసాయనాలు, ఆటోమొబైల్స్ ఉండే 100 శాతం, 125 శాతం, 150 శాతం రేట్లను 70 శాతం శ్లాబుల మిళితం చేశారు. అయితే మొత్తం మీద వర్తించే సుంకం చాలా తక్కువ వస్తువులకే మారింది. తగ్గిన ప్రాథమిక కస్టమ్స్ సుంకం రేటును వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) సహాయంతో అంతక్రితం స్థాయికే తీసుకొచ్చారు.
హార్లే-డేవిడ్‌సన్‌కు ఊరట
అమెరికాకు చెందిన బైక్‌ల తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్‌కు ఊరట లభించినట్లే. హై ఎండ్ మోటార్ సైకిళ్లపై మన దేశం, తాజా బడ్జెట్‌లో దిగుమంతి సుంకం తగ్గించడమే దీనికి కారణం. భారత్‌ను ట్రెమండస్ టారిఫ్ మేకర్‌గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం...కంప్లీట్లీ బిల్డ్ అప్ (సీబీయూ) యూనిట్ల రూపంలో దిగుమతి చేసుకునే 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై అంతక్రితం ఉన్న 50 శాతం సుంకాన్ని 40 శాతానికి పరిమితం చేస్తారు. సెమీ నాక్డ్ డౌన్ (ఎస్‌కేడీ) వాహనాలపై 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తారు. కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (సీకేడీ) యూనిట్లపై 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. హై ఎండ్ కార్ల (40,000 డాలర్ల ధరపైన) టారిఫ్‌ను 125 శాతం నుంచి 70 శాతానికి పరిమితం చేశారు. తాజా రేట్ల సవరణతో హైఎండ్ బైక్‌లు, కార్ల ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు.