సెహ్వాగ్, అమితాబ్, సెలబ్రిటీల.. జై బోలో భారత్
విపక్ష కూటమి పేరు ఇండియా అని ఉంది కాబట్టి దాన్ని ప్రజల దృష్టిలో లేకుండా చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే సెలబ్రిటీలు చాలామంది భారత్ అనే పేరుకే ఓటేస్తున్నారు.
ఇండియా కాదు.. భారత్.. ఇప్పుడు ఇండియాలో అత్యధికంగా ట్రెండ్ అవుతున్న టాపిక్. రాజకీయ నేతల నుంచి సినిమా తారల వరకు, క్రికెటర్ల నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ దీనిపై చర్చించుకుంటున్నారు. విపక్ష కూటమి పేరు ఇండియా అని ఉంది కాబట్టి దాన్ని ప్రజల దృష్టిలో లేకుండా చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే సెలబ్రిటీలు చాలామంది భారత్ అనే పేరుకే ఓటేస్తున్నారు.
భారత్ మాతాకీ జై అన్న బిగ్‌బీ
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన ట్విటర్ అకౌంట్‌లో భారత్ మాతా కీ జై అంటూ ట్వీట్ చేశారు. భారత్ అని పేరు మార్చాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో అమితాబ్ ట్వీట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. దీన్ని కొంతమంది నెటిజన్లు సపోర్ట్ కూడా చేశారు.
టీమిండియా కాదు.. టీమ్ భారత్ అన్న సెహ్వాగ్
మరోవైపు మాజీ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ భారత్ పేరుకు భారీ మద్దతు పలుకుతున్నారు. తన ట్విటర్ హ్యాండిల్‌లో ప్రౌడ్ ఇండియన్ అనే బయోను ప్రౌడ్ భారతీయగా మార్చేశారు. ప్రతి భారతీయ క్రికెటరూ తన ఛాతీ మీద ఇండియా అని కాకుండా భారత్ అనే పేరు ధరించాలని ఆకాంక్షించారు. టీమిండియా అనొద్దని, టీం భారత్ అనాలని బీసీసీఐ కింగ్‌పిన్ జైషాకు సూచించేశాడు వీరేంద్రుడు. ఇంకా చాలామంది సెలబ్రిటీలు భారత్ అనే పేరుకు మద్దతిస్తూ.. ట్వీట్లు, షేర్లు చేస్తున్నారు.