బతికుండగానే చంపేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?

సంపాదించుకోవడానికి చండాలపు పనులు చాలా ఉన్నాయి.. ఇలా అక్కర్లేదు.. ఇది జీవితం. దీనిపై అలాంటి పనులు చేయకండి. ప్రజలు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. అటువంటి ప్రచారం చేస్తున్న వారికి గట్టి బుద్ధి చెప్పండి' అని కోట శ్రీనివాసరావు కోరారు.

Advertisement
Update:2023-03-21 11:51 IST

డబ్బు కోసం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మరి దిగజారిపోతున్నాయి. వ్యూస్ కోసం సెలబ్రిటీలు, సినీ నటులు చనిపోయినట్లు ప్రచారం చేస్తున్నాయి. మేము బతికి ఉన్నామురా.. మహాప్రభో అని మొత్తుకుంటున్నా.. పదే పదే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో వార్తలు వచ్చాయి. దీంతో కోట శ్రీనివాసరావు స్వయంగా ఒక వీడియో విడుదల చేశారు. నేను బతికే ఉన్నాను అని.. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న రాత్రి నుంచి కోట శ్రీనివాసరావుకి ఆరోగ్యం క్షీణించిందని.. ఇవాళ ఉదయం ఆయన మృతి చెందారని కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఈవార్త నిజం అనుకొని కొందరు కోట కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో విషయం వారి దృష్టికి వెళ్ళింది. తాను చనిపోయినట్లు వస్తున్న ఫేక్ వార్తలపై కోట శ్రీనివాసరావు స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

'ఇవాళ ఉదయం నేను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి. అవి నిజం అనుకొని ఇప్పటిదాకా మా ఇంటికి 50 మందికి పైగా ఫోన్ చేశారు. ఒక వ్యాన్ లో పదిమంది పోలీసులు ఇంటి వద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు..? అని అడిగితే.. మీరు చనిపోయారని వచ్చిన వార్తలతో బందోబస్తు కోసం వచ్చినట్లు సమాధానం ఇచ్చారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను.

సంపాదించుకోవడానికి చండాలపు పనులు చాలా ఉన్నాయి.. ఇలా అక్కర్లేదు.. ఇది జీవితం. దీనిపై అలాంటి పనులు చేయకండి. ప్రజలు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. అటువంటి ప్రచారం చేస్తున్న వారికి గట్టి బుద్ధి చెప్పండి' అని కోట శ్రీనివాసరావు కోరారు.

ఏది ఏమైనా బతికి ఉండగానే తాను చనిపోయినట్లు ప్రచారం చేయడంపై కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఉగాది పండుగ.. ఆ పండుగ ఎలా జరుపుకోవాలి.. అని ఇంట్లో అందరం కూర్చొని ఆలోచిస్తుంటే.. ఇలాంటి పనులేంటీ..? అని కోట శ్రీనివాసరావు భావోద్వేగానికి గురయ్యారు. వ్యూస్ కోసం సోషల్ మీడియా ఛానళ్లు సెలబ్రిటీలను, సినీ ప్రముఖులను బ‌తికుండ‌గానే చంపడం కొత్తేమీ కాదు. కొద్ది రోజుల కిందట నటుడు శ్రీకాంత్, సీనియర్ నటీమణులు శారద, కవిత చనిపోయినట్లుగా ఫేక్ వార్తలు రావడంతో వారు మీడియా ముందుకు వచ్చి మేము బతికే ఉన్నాం.. అంటూ చెప్పుకోవాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News