మీకు సొట్ట బుగ్గ కావాలా? దానికీ ఓ సర్జరీ ఉంది.!

సొట్ట బుగ్గలు అనేవి సహజంగా రావాల్సిందే. మనం ఏరి కోరి బుంగ మూతి పెట్టినా ఆ బుగ్గలు మనకు రావు. కానీ, చాలా మందికి సొట్ట బుగ్గలు అంటే చాలా మోజు ఉంటుందని ఇటీవల పలు సర్వేల్లో తెలిసింది.

Advertisement
Update:2022-09-25 06:00 IST

మనిషి అందానికి, రూపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనం ఎంత నాగరిక ప్రపంచంలో బతుకుతున్నా.. అందానికి ఇచ్చే విలువే వేరు. 'డోన్ట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్' అని ఎంత మంది చెప్పినా.. ఒక మనిషిని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అతడి ముఖం చూసే కలుగుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అలా పుట్టింది. కొంత మందికి తెల్లగా ఉన్నావాళ్లు, మరి కొంత మందికి చామన ఛాయలో ఉండే వాళ్లు నచ్చుతారు. కొందరికి ఎత్తైన వాళ్లు.. మరి కొందరికి మధ్యస్తంగా ఉండే వాళ్లు నచ్చుతుంటారు. కానీ ముఖం చూడగానే అరే.. భలే ఉన్నారు అనిపించేది మాత్రం సొట్ట బుగ్గ ఉన్నవాళ్లే. వాళ్లు నవ్వినా.. ఏడ్చినా ఆ సొట్ట బుగ్గలు చూడాలని అనిపిస్తుంటాయి.

సొట్ట బుగ్గలు అనేవి సహజంగా రావాల్సిందే. మనం ఏరి కోరి బుంగ మూతి పెట్టినా ఆ బుగ్గలు మనకు రావు. కానీ, చాలా మందికి సొట్ట బుగ్గలు అంటే చాలా మోజు ఉంటుందని ఇటీవల పలు సర్వేల్లో తెలిసింది. పుట్టుకతో తమకు సొట్ట బుగ్గలు లేవని చాలా మంది బాధపడుతూ ఉంటారట. మరి అలాంటి సొట్ట బుగ్గలు కృత్రిమంగా ఏర్పాటు చేసుకోవడం సాధ్యమవుతుందా? అంటే.. చాలా సులువే అని ప్లాస్టిక్ సర్జన్స్ చెప్తున్నారు. పిల్లలు పుట్టక పోతేనే ఐవీఎఫ్ లాంటి పద్దతులు ఉన్నాయి. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేస్తున్న ఈ రోజుల్లో సొట్ట బుగ్గలు తెప్పించడం చిటికెలోనే అయిపోతుందని డాక్టర్లు భరోసా కూడా ఇస్తున్నారు.

సొట్ట బుగ్గలు అనేవి వాస్తవానికి ఒక విధమైన లోపం అని డాక్టర్లు అంటున్నారు. మన ముఖంలో అనేక కండరాలు ఉంటాయి. కళ్ల నుంచి చెంపల మీదుగా గడ్డం వరకు ఎన్నో కండరాలు ఉంటాయి. మనం నవ్వినా, ఏడ్చినా, మాట్లాడినా ఈ కండరాలు నిత్యం కదులుతూ ఉంటాయి. అయితే చెంపల దగ్గర ఉండే కొన్ని కండరాలు బిగుసుకొని పోవడం వల్ల బుగ్గలు సహజసిద్దంగా కదలలేక.. ఈ సొట్ట బుగ్గలు ఏర్పడతాయి. కొందరికి రెండు వైపులా కండరాల లోపం ఉంటే.. రెండు వైపులా సొట్ట బుగ్గలు ఏర్పడతాయి. అందుకే ప్లాస్టిక్ సర్జన్స్ ఏం చెబుతారంటే.. సాధారణంగా ఏదైనా లోపం ఉంటే సరి చేయడానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ సొట్ట బుగ్గల కోసం కొత్తగా లోపాన్ని సృష్టించాల్సి వస్తుందని.

సొట్ట బుగ్గల కోసం ఒక గంట సర్జరీ చేస్తే సరిపోతుందని డాక్టర్లు వెల్లడించారు. లోకల్ అనస్తీషియా ఇచ్చి బుగ్గ లోపలి వైపు కండరాల వద్ద చిన్న పాటి సర్జరీ చేస్తారు. గతంలో సూచరింగ్ (కుట్లు) వేసే వాళ్లు. కానీ ఇప్పుడు లేజర్ చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కొన్ని మిల్లీమీటర్లు కట్ చేసి.. నీడిల్స్‌తో కండరాలు చిన్నగా కుడతారు. దాదాపు లేజర్ చికిత్సలో కుట్లు అనేవి ఉండవు. ఈ సర్జరీ చేసుకున్న తర్వాత రెండు మూడు వారాలు నోరు నొప్పి లేస్తుంది. కానీ పూర్తిగా నయం అయ్యాక.. సర్జరీ చేసుకున్న వ్యక్తికి అలవాటు అవుతుంది. డెంటల్ సర్జన్ పన్ను పీకి కుట్లు వేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో.. సొట్ట బుగ్గ కోసం చేసిన చికిత్స కూడా అలాగే ఉంటుంది. అయితే, సర్జరీ తర్వాత ఎక్కువగా నవ్వుతుంటే ఆ డింపుల్ నవ్వినప్పుడు ఏర్పడుతుంది. బాధతో ఎక్కువ రోజులు నోర్మూసుకొని ఉంటే.. సర్జరీ ప్రభావం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.

డింపుల్ సర్జరీ వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అయితే డయాబెటిస్, స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్లకు కొంచెం సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. ఇక కుట్లు సరిగా కుట్టక.. సర్జరీ చేసిన ప్రదేశంలో మనం తిన్న ఆహారం ఇరుక్కొని ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. మరోవైపు సహజ సిద్దంగా ఏర్పడిన డింపుల్ లాగానే సర్జరీ చేసిన సొట్ట ఉండక పోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మొత్తానికి డింపుల్ సర్జరీ అనేది కేవలం అందాన్ని ఇనుమడింప చేసేదే తప్ప కంపల్సరీ సర్జరీ కాదు. కాబట్టి ఎవరైనా ఈ ప్రొసీజర్ చేయించుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News