పిల్లలు ఇంటర్నెట్‌కు అడిక్ట్ అయ్యారా.. అయితే ఇలా చేయండి

పిల్లలకు సెపరేట్ ట్యాబ్ లేదా మొబైల్ ఉంటే దానిపై రిమోట్ యాక్సెస్ పేరెంట్స్ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఫ్యామిలీ లింక్ యాప్ నిరోధిస్తుంది.

Advertisement
Update:2022-10-26 16:40 IST

పిల్లలు అన్నం తినడం లేదనో.. పనికి అడ్డు తగులుతున్నారనో చిన్నప్పటి నుంచే చేతిలో మొబైల్ ఫోన్ పెట్టడం అలవాటు చేస్తాము. ఏవో గేమ్స్ ఆడుకుంటూ, బొమ్మలు చూసుకుంటూ మనల్ని విసిగించరనే ఉద్దేశంతో అలా మొబైల్ ఇచ్చేస్తాము. కానీ రానురానూ సెల్ ఫోన్ చిన్న పిల్లలకు ఒక వ్యసనంలా మారిపోతుంది. మనకు తెలియకుండా ఇంటర్నెట్ సెర్చ్ చేస్తుంటారు. వీడియోలు చూడటం, సోషల్ మీడియాను కూడా ఫాలో అవడం చేస్తుంటారు. అక్కడ పనికి వచ్చే విషయాల కన్నా.. పిల్లలకు ప్రమాదకరంగా మారే విషయాలే ఎక్కువగా ఉంటాయి.

మొదట్లో సరగాగా చూడటం మొదలు పెట్టినా.. ఆ తర్వాత ఇంటర్నెట్, సోషల్ మీడియా వారికి ఒక వ్యసనంలా మారిపోతుంది. అందుకే మన పిల్లలను వీటి బారి నుంచి రక్షించుకోవడం ప్రతీ తల్లిదండ్రుల బాధ్యత. ఆన్‌లైన్‌లో విస్తృతంగా అందుబాటులో ఉండే అనుచితమైన కంటెంట్, నేర పూరిత కార్యకలాపాలతో కూడిన వీడియోలు, చిన్న పిల్లల మనసు మార్చి వారిని మోసం చేసే వ్యక్తుల నుంచి తప్పకుండా దూరం ఉంచాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే.

సోషల్ మీడియా ద్వారా, ఇతర మార్గాల్లో వచ్చే లింక్స్‌పై క్లిక్ చేస్తే అవి ఏ అశ్లీల వెబ్‌సైట్‌కో, వీడియోల దగ్గరకో తీసుకొని పోతుంటాయి. అలాంటి వాటిపై పిల్లలు క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఇంటర్నెట్ గురించి పిల్లలకు మంచిగా, సహనంతో వివరించాలి. అందులో దేన్ని మనం వాడుకోవాలో స్పష్టంగా తెలియజేయాలి. రోజుకు అరగంట నుంచి గంట లోపే ఇంటర్నెట్ వినియోగాన్ని ఆపేయాలని చెప్పాలి.

మాల్వేర్ వంటివి ఎలాంటి హాని చేస్తాయో వివరించాలి. తెలియని వ్యక్తులు, అపరిచిత ఐడీల నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌పై అవగాహన కల్పించాలి. మనం కూడా మొబైల్ ఇచ్చే ముందు మన మెయిల్స్‌లో అలాంటి అనుమానాస్పద లింక్స్ ఉంటే తొలగించాలి. ఇలాంటి లింక్స్ కారణంగా మన మొబైల్ హ్యాక్ అవడమే కాకుండా, ఆర్థిక నేరాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని పిల్లలకు చెప్పాలి. పిల్లలు మొబైల్‌లో ఏం చూస్తున్నారు? ఎవరికైనా కాల్స్ చేస్తున్నారా? ఏయే వెబ్‌సైట్లు తరచూ ఫాలో అవుతున్నారో గమనించాలి. ఇందు కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్యామిలీ లింక్ యాప్ ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసి ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

పిల్లలకు సెపరేట్ ట్యాబ్ లేదా మొబైల్ ఉంటే దానిపై రిమోట్ యాక్సెస్ పేరెంట్స్ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఫ్యామిలీ లింక్ యాప్ నిరోధిస్తుంది. పిల్లలకు అవసరమైన యాప్స్, కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా చేయాలి. వాళ్ల కోసం ప్రత్యేకమైన బ్రౌజర్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేయాలి. గూగుల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పిల్లలు చూడకూడదు అనుకున్న వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలి. అలాగే నిర్ణీత సమయం మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగించేలా టైమ్ సెట్ చేయాలి. ఎక్కువ సమయం పిల్లలతో గడపడం, మాట్లాడటం, ఆడుకోవడం వల్ల పిల్లలకు ఇంటర్నెట్ వినియోగానికి కూడా దూరంగా ఉంచవచ్చు.

Tags:    
Advertisement

Similar News