నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు ముఖ్యం!
నవరాత్రుల సందర్భంగా చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఉపవాసాలు చేసేటప్పుడు అనారోగ్యం బారిన పడకుండా, నీరసించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
నవరాత్రుల సందర్భంగా చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఉపవాసాలు చేసేటప్పుడు అనారోగ్యం బారిన పడకుండా, నీరసించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..
ఉపవాసం పేరుతో అసలు ఏదీ తీసుకోకపోతే శక్తి సరిపోక నీరసించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా రోజూ పొద్దున్నే లీటర్ నీటిని తాగాలి. ఆ తర్వాత నిమ్మరసం లేదా ఏదైనా పండ్లరసాన్ని తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఉపవాసం చేయడానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
ఉపవాసం చేసేటప్పుడు ఎన్ని గంటల పాటు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలా? లేదా రాత్రి భోజానాన్ని మానుకోవాలా అన్నది నిర్థారించుకుని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. పగలు ఉపవాసం ఉండేవాళ్లు పొద్దున్నే పండ్ల రసాలు తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత వీలైనంత త్వరగా భోజనం తీసుకోవాలి. అది కూడా పోషకాహారం అయి ఉండాలి. ఉపవాసం తర్వాత స్వీట్లు, వేగించిన పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది.
ఇక రాత్రిళ్లు ఉపవాసం ఉండేవాళ్లు పొద్దున, మద్యాహ్నం తేలికపాటి ఆహారాలు తీసుకుంటే సాయంత్రానికి పొట్ట తేలికగా ఉంటుంది. రాత్రిళ్లు ఏమీ తినకపోయినా మంచి నీళ్లు, నిమ్మరసం తీసుకుంటుంటే శక్తి నశించకుండా ఉంటుంది.
ఇకపోతే చాలామంది ఉపవాసం అంటే అన్నానికి బదులు టిఫిన్లు చేస్తుంటారు. ఇది ఉపవాసం కిందకు రాదు అని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ అన్నానికి బదులు ఇతర పదార్థాలు తీసుకోవాలనుకుంటే ఇడ్లీ, దోశలకు బదులు మిల్లెట్ ఉప్మా, రాగి జావ, నానబెట్టిన నట్స్ వంటివి తీసుకోవచ్చు.
రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు, గర్భిణులు ఉపవాసాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. ఉపవాసం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా ఉపవాసం చేయొచ్చో, లేదో.. డాక్టర్‌ను అడిగి నిర్ణయించుకోవాలి.